PV Sunil Kumar’s Sensational Proposal: పీవీ సునీల్‌కుమార్ సంచలన ప్రతిపాదన: “దళిత నాయకుడ్ని ఉప ముఖ్యమంత్రిగా.. కాపు నాయకుడ్ని ముఖ్యమంత్రిగా చేయాలని” డిమాండ్
"కాపు నాయకుడ్ని ముఖ్యమంత్రిగా చేయాలని” డిమాండ్
PV Sunil Kumar’s Sensational Proposal: అఖిల భారత సర్వీసు అధికారిగా ఉంటూ రాజకీయ నాయకుడి తరహాలో ప్రకటనలు చేసి వివాదాస్పద స్థితిలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో ఆదివారం జరిగిన డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసుల (ప్రవర్తన) నియమావళి ఉల్లంఘనగా మారాయని విశ్రాంత ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ‘మీ కాపు నాయకున్ని ముఖ్యమంత్రిగా చేసుకోండి.. మా దళిత నాయకున్ని ఉప ముఖ్యమంత్రిగా చేయండి’ అంటూ సునీల్‌కుమార్ చేసిన పిలుపు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పదే పదే విదేశీ పర్యటనలకు వెళ్లారనే అభియోగాలపై సస్పెన్షన్‌కు గురైన, శాసనసభ ఉపాధ్యక్షుడు కె.రఘురామకృష్ణరాజును వైసీఎస్‌ఆర్ సర్కారు కాలంలో సీఐడీ కస్టడీలోకి తీసుకునేందుకు యత్నించారనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పీవీ సునీల్‌కుమార్ మరోసారి రాజకీయ వివాదాలకు కారణమయ్యారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన ఆయన, ‘మీ కాపు నాయకున్ని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకున్ని ఉప ముఖ్యమంత్రిని చేయండి. మా హర్షకుమార్, మా విజయ్‌కుమార్, మా జడ శ్రవణ్‌కుమార్‌లలో ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయండి. రెండేళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రి కాదు.. ఐదేళ్లు ఉండే పదవి కావాలి’ అని పేర్కొన్నారు.
కాపు సామాజికవర్గం రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులమని, వారితో కలిస్తే బలం రెట్టింపవుతుందని సునీల్‌కుమార్ చెప్పారు. ‘వారూ మనలో కలిస్తే మన బలం రెట్టింపవుతుంది. మన డిమాండ్‌కు సహకరించాలని కాపు సోదరులను కోరండి. అందర్ని కలుపుకొని పోయి.. అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేయండి. మీరు దళితవాడ పంచాయతీకి మద్దతుగా నిలిస్తే మేము మీకు మద్దతిస్తామని వారితో చెప్పండి’ అని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగ వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అఖిల భారత సర్వీసు అధికారిగా ఉంటూ రాజకీయ పదవులపై ప్రకటనలు చేయడం దుష్ప్రవర్తన అని విశ్రాంత ఐఏఎస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ‘నాకు ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా వద్దని చెప్పి దళితవాడను పంచాయతీగా చేయాలని అడిగాను. నేను టికెట్ వదులుకుంటేనే చేస్తామనే హామీ లభించింది’ అంటూ సునీల్‌కుమార్ చెప్పిన మాటలు కూడా వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం నిషేధం
అఖిల భారత సర్వీసు (ప్రవర్తన) నియమావళి ప్రకారం, ఐఏఎస్, ఐపీఎస్‌లాంటి అధికారులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఏ పార్టీలోనూ సభ్యత్వం, సంబంధాలు పెట్టుకోకూడదు. రాజకీయ ఉద్యమాలు, కార్యకలాపాల్లో పాల్గొనడం, ఆర్థిక మద్దతు ఇవ్వడం నిషేధం. రాజకీయ తటస్థత, నైతికత పాటించాలి. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించకూడదు. ‘సునీల్‌కుమార్ వ్యాఖ్యలు నియమావళి ఉల్లంఘనలే. ఇది దుష్ప్రవర్తన కిందకు వస్తుంది. అఖిల భారత సర్వీసుల (క్రమశిక్షణ, అప్పీలు) నియమావళి-1969 ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు’ అని ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి చెప్పారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. సునీల్‌కుమార్‌పై ఇప్పటికే సస్పెన్షన్ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.