YS Jagan : రాహుల్‌, చంద్రబాబు, రేవంత్‌లు హాట్‌లైన్లో టచ్‌లో ఉంటారు

కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబులపై మాజీ సీయం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సంచలన ఆరోపణలు;

Update: 2025-08-13 10:38 GMT

ఏఐసీసీ కీలక నేత రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు అనునిత్యం హాట్‌లైన్‌లో ఒకరికొకరు టచ్‌లో ఉంటారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్‌.జగన్‌ చంద్రబాబుతో రేవంత్‌, కాంగ్రెస్‌ హైకమాండ్‌ టచ్‌లో ఉంటారని అన్నారు. ఓట్ల చోరీ గురించి, ఓటర్ల జాబితాలో అవకతవకల గురించి రాహుల్‌ గాంధీ మాట్లాడినప్పుడు కర్నాటక, మహారాష్ట్రల గురించి మాట్లాడతారు తప్పితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన ఓటర్ల అవకతవకలపై ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్‌.జగన్‌ నిలదీశారు. చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ ఒక్క విమర్శ కూడా ఎందుకు చెయ్యరని జగన్‌ ప్రశ్నించారు. రాజధాని పేరుతో అమరావతిలో ఎన్నో స్కాములు జరుగుతున్నాయి… అమరావతే పెద్ద స్కామ్‌, ఈ విషయాలపై కాంగ్రెస్‌ ఎప్పుడూ ఎందుకు మాట్లాడదని జగన్‌ ఎత్తిచూపారు. గత ఎన్నికల్లో పోలింగ్‌ రోజుకీ ఓట్ల లెక్కింపు నాటికీ 12.5 శాతం అంఏ దాదాపు 48 లక్షల ఓట్లు పెరిగాయని… ఎలా పెరిగాయని కాంగ్రెస్‌ ఎందుకు మాట్లాడదని, ఆ సబ్జెక్ట్‌ భుజాన వేసుకు తిరుగుతున్న రాహుల్‌ గాంధీ సైతం ఏపీలో ఓట్ల గురించి ఎందుకు ప్రస్తావించరని వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని ఎండగట్టారు.

Tags:    

Similar News