‘Raitanna… Mee Kosam’ Program: నవంబరు 24 నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం.. అన్నదాతల ఇంటి వద్దకే అధికారులు, ప్రజాప్రతినిధులు!
మీ కోసం’ కార్యక్రమం.. అన్నదాతల ఇంటి వద్దకే అధికారులు, ప్రజాప్రతినిధులు!
‘Raitanna… Mee Kosam’ Program: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం మరింత దూకుడు పెంచింది. ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ‘రైతన్నా.. మీ కోసం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల ఇళ్లకు నేరుగా వెళ్లి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు ‘పంచసూత్రాల’ అమలు ద్వారా కలిగే లాభాలను వివరించనున్నారు. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ విధానాలపై అవగాహన కల్పించేలా ఆదేశాలు జారీ అయ్యాయి.
గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయం, అనుబంధ శాఖలు, మార్కెటింగ్ అధికారులు, సిబ్బందితో కలిపి సుమారు 10 వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచసూత్రాలు – నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు – అమలుపై లోతైన చర్చ జరిగింది. రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుండి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని సీఎం ఆదేశించారు.
సీఎం మాట్లాడుతూ.. ‘‘గత 17 నెలలుగా రైతులు, వ్యవసాయాన్ని ముందుకు తీసుకొచ్చాం. ‘అన్నదాతా సుఖీభవ - పీఎం కిసాన్’ కింద 46.50 లక్షల మంది రైతులకు రూ.14 వేల చొప్పున జమ చేశాం. బిందు సేద్యం, పొలం పిలుస్తోంది కార్యక్రమాలతోపాటు ఇప్పుడు పంచసూత్రాలతో రైతులకు మరింత మేలు చేకూరుస్తున్నాం. పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం, ఆక్వా, ఉద్యానవన, సెరికల్చర్ రంగాల రైతులకు కూడా ఈ అవగాహన అందాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి, భూసార రక్షణతోపాటు ఆరోగ్యాన్ని కాపాడాలి. రైతు బజార్లలో ప్రకృతి ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం కల్పించాలి’’ అని పేర్కొన్నారు.
పురుగుమందుల అధిక వినియోగం నష్టాలు, సేంద్రీయ విధానం ద్వారా విదేశీ మార్కెట్లలో డిమాండ్, భూసార పరీక్షలు, సమర్థ నీటి నిర్వహణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి అంశాలను రైతులకు ఇంటింటా వివరించాలని సీఎం ఆదేశించారు. డిసెంబరు 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహించి, రైతుల సమస్యలు నేరుగా తెలుసుకునేలా ప్రణాళిక రూపొందించారు.