Cm Chandrababu : స్టార్టప్ లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు;

Update: 2025-08-20 10:00 GMT
  • అమరావతితో పాటు ఐదు చోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు
  • ఆర్టీఐహెచ్ ప్రారంభంలోనే ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ లకు రికార్డు స్థాయి రిజిస్ట్రేషన్లు
  • 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,67,321 రిజిస్ట్రేషన్లకు గిన్నిస్ వరల్డ్ రికార్డు

ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు చోట్ల ఇన్నోవేషన్ కేంద్రాలను హబ్ అండ్ స్పోక్ మోడల్ లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. బుధవారం మంగళగిరిలోని మయూరి టెక్ పార్కులో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.."రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నాం. రతన్ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శం. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించటం ఓ చారిత్రాత్మక సమయం. గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే విధానాన్ని రతన్ టాటా అవలంభించారు. రతన్ టాటా ఆలోచనల్ని భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఇన్నోవేషన్ హబ్ లను ప్రారంభించాం. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయి. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇన్నోవేషన్ కేంద్రాలు ఉండాలని నిర్ణయించాం. యువతకు ఉన్న వినూత్న ఆలోచనల్ని క్రోడీకరించి ప్రోత్సహించేలా ఈ ఇన్నోవేషన్ హబ్ పని చేస్తుంది. యువపారిశ్రామిక వేత్తలు అవకాశాలను వాడుకోండి. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్న అంశాన్ని నేను విశ్వసించను. ఏపీ పారిశ్రామికవేత్తలు గ్లోబల్ కమ్యూనిటికీ సేవలందించేలా ఎదగాలని కోరుకుంటున్నా. అగ్రిటెక్ లో ఇన్నోవేషన్ కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, ఇలా అనేక రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి." అని సీఎం వివరించారు.

ఇంటికో పారిశ్రామిక వేత్త

ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామిక వేత్త రావాలనేదే నా నినాదం. ఈ లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు పనిచేస్తాయి. సరైన ప్రభుత్వ విధానాలు అవలంభిస్తే ఆదాయం, సంపద వస్తుంది. భవిష్యత్ అంతా ఐటీ రంగానిదేనని నాడు గుర్తించాను. దేశంలో ఎవరూ చేయనంతగా ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశాం. సంపద సృష్టి జరగాలంటే ఆర్థిక వృద్ధి అవసరం. గత 10 ఏళ్లలో 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. అప్పుడు సంపద మరింతగా పెరుగుతుంది. ఈ అవకాశాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలి. దీని కోసం రాష్ట్రాన్ని, అమరావతి సహా వివిధ ప్రాంతాలను సిద్దం చేస్తున్నాం. ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రచించాం. అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశాన్ని దేవుడు నాకిచ్చాడు. క్వాంటం వ్యాలీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇక విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి అంతర్జాతీయ ప్రమాణాలు సాధింటంలో మన పరిశ్రమలు మెరుగైన ఫలితాలు సాధించాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనలు, ఎకో సిస్టం ఉంటేనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులు అందించగలం. దీంట్లో భాగంగానే అమరావతి నగరం క్వాంటం కంప్యూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది. క్వాంటం కంప్యూటింగ్ ద్వారా రియల్ టైమ్ డేటాను విశ్లేషించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం." అని చంద్రబాబు చెప్పారు.

సంపద ఫుల్... సంక్షేమం డబుల్

మరింత సంపద సృష్టించాలి. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది... సంక్షేమం చేయవచ్చు. కమ్యూనిజం, కేపటలిజం ఏమీ ఉండదు. టూరిజమే ఉంటుంది. టూరిజం కూడా అత్యధిక ఉపాధి కల్పించే రంగం. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేయడమే లక్ష్యం. ఒక వైపు సందప సృష్టిస్తూనే.. పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. పీ4 కింద పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఓవైపు సంపద సృష్టి.. మరోవైపు పేదల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీని మారుస్తాం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచటమే లక్ష్యం. 704 పౌర సర్వీసులు వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రజలకు అందుతున్నాయి. డేటా లేక్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం, పౌరసేవలు ఇలా అన్నిటినీ అనుసంధానం చేశాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం డిజినెర్వ్ సెంటర్ ప్రాజెక్టులోనూ టాటాతో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం కుప్పంలో అమలు అవుతోంది. దీనికి సంజీవని అని పేరు పెట్టాం. సంజీవని ద్వారా ప్రపంచంలో ఉన్న వైద్య చికిత్సల టెక్నాలజీని ఒక చోటకు తెచ్చి రాష్ట్రంలోని అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్నది మా లక్ష్యం." అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ..."స్టార్టప్ లకు ఎన్నో అవకాశాలున్నాయి. ఇన్నోవేషన్ కేంద్రాల ద్వారా ఆరోగ్యం, డిఫెన్సు, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో పరిష్కారాలకు అవకాశాలున్నాయి. ఇన్నోవేషన్ హబ్ ల ద్వారా స్థానిక, ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అంశాలకు పరిష్కారం దొరుకుతుంది. ఎన్నో ఆలోచనల సమాహారంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మారుతుందని ఆశిస్తు్న్నా. సీఎం చంద్రబాబు తన దార్శనికతతో కొద్ది సమయంలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు రూపం ఇచ్చారు." అని చెప్పారు.

రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు

ఏపీలో ఇన్నోవేషన్, బిజినెస్ స్టార్టప్ ల కోసం రికార్డు స్థాయిలో 1,67,321 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 24 గంటల్లో ఈ స్థాయి రిజిస్ట్రేషన్లు జరగటంపై ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందచేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో వివిధ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. రతన్ టాటా ఇన్నోవేన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్ , నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి, అమర్ రాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా జయదేవ్ తదితరులు హాజరయ్యారు.

Tags:    

Similar News