జెత్వానీ కేసులో పీఎస్‌ఆర్‌కు ఊరట

Relief for PSR in Jethwani case;

Update: 2025-06-19 09:24 GMT

నటిమణి కాదంబరీ జెత్వానీ ఫిర్యాదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమె ఫిర్యాదు ఆధారంగా పీఎస్ఆర్‌పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ తదితరులు వేసిన పిటిషన్లతో పీఎస్ఆర్ పిటిషన్‌ను కలిపి విచారించాలంటూ రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.



వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి, వేధింపులకు గురి చేశారని కాదంబరీ జెత్వానీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు పీఎస్ఆర్ సహా మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



ఈ కేసులో మే నెలలోనే కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, ఏసీపీ కె.హనుమంతరావు, సీఐ ఎం.సత్యనారాయణలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, పీఎస్ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.



తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ పీఎస్ఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి విచారణ జరిగే వరకు ఆయనపై ఏ చర్య తీసుకోవద్దంటూ కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో పీఎస్ఆర్‌కు ఊరట లభించింది.


Tags:    

Similar News