CM Chandrababu Gives Key Directions at Collectors: బాధ్యతాయుత పరిపాలనే లక్ష్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక సూచనలు

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Update: 2025-12-17 08:42 GMT

CM Chandrababu Gives Key Directions at Collectors: రాష్ట్రంలో సుపరిపాలనను నెరవేర్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ పని చేపట్టినా దానిలో వివరాలు పూర్తిగా ఉండాలని, నిర్దేశిత సమయంలో లక్ష్యాలు సాధించేలా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పలు మార్గదర్శకాలు జారీ చేశారు.

సదస్సులో మాట్లాడిన చంద్రబాబు.. ‘‘నిరంతరం నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి వెనకాడకూడదు. చేపట్టే ప్రతి పనిలో బాధ్యత, జవాబుదారీతనం కనబరచాలి. మెరుగైన ఫలితాలకు ప్రాధాన్యతనివ్వాలి. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనితీరు ఉండాలి. మన చర్యల వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా? లేదా? అనేది ఆలోచించాలి’’ అని సూచించారు.

ఉద్యోగ నియామకాలపై మాట్లాడుతూ.. ఎన్ని ఫిర్యాదులు, కోర్టు కేసులు వచ్చినా కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశామని, అంతకుముందు మెగా డీఎస్సీ నిర్వహించామని గుర్తుచేశారు. ‘‘ఇలాంటి ప్రయత్నాలకు గందరగోళం సృష్టించే పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు.. సద్వినియోగం చేయడమే. ప్రజలకు అందే అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నాం’’ అని చంద్రబాబు వివరించారు.

ఈ సదస్సులో కలెక్టర్లు క్షేత్రస్థాయి సమస్యలు, సవాళ్లపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వగా.. సీఎం వాటిపై సమగ్ర చర్చ జరిపి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికార యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన నొక్కిచెప్పారు.

Tags:    

Similar News