Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసులో సంచలనం.. బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు!
బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు!
Raghu Rama Krishna Raju: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కె.రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నం చేశారని ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఎం.సునీల్ నాయక్‌ను పట్నాలోని అతని అధికారిక నివాసంలోనే దర్యాప్తు అధికారి, విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ నేతృత్వంలోని ఏపీ పోలీసు బృందం సోమవారం ఉదయం అరెస్టు చేసింది.
ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు తరలించి విచారణ చేయడానికి ట్రాన్సిట్ వారంట్ కోసం పట్నా స్థానిక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారంట్‌ను నిరాకరించింది. మరో 30 రోజుల వరకు ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో సునీల్ నాయక్‌ను అరెస్టు చేసినా పట్నా నుంచి ఏపీకి తీసుకురావడం సాధ్యం కాలేదు.
ఈ మొత్తం ఘటనలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక్కటి ఒక్కటిగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయనగరం ఎస్పీ దామోదర్ బృందాన్ని బీహార్ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సునీల్ నాయక్‌ను వైద్య పరీక్షలకు తీసుకెళ్లనీయకుండా, ట్రాన్సిట్ వారంట్ దాఖలు చేయడానికి కోర్టుకు వెళ్లనీయకుండా అనేక ఆటంకాలు సృష్టించారు. అయినా ఏపీ పోలీసులు చాకచక్యంగా అన్ని అడ్డంకులను అధిగమించారు. అయితే కోర్టు తిరస్కరణతో సునీల్ నాయక్‌కు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నట్లైంది.
పట్నా స్థానిక కోర్టు వద్ద కూడా ఏపీ పోలీసులకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. ఏపీ పోలీసులు కేసు డైరీ, అరెస్టు వారంట్ తీసుకురాలేదని సునీల్ నాయక్ తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదించారు.
గత ఏపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును రాజద్రోహం కేసులో అరెస్టు చేసి సీఐడీ కస్టడీలోకి తీసుకున్న సందర్భంలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నం చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో సునీల్ నాయక్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.