Google Cloud Director : ఎపిలో చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి
గూగుల్ క్లౌడ్ డైరక్టర్ డ్రూ బ్రైన్స్ కు మంత్రి లోకేష్ ఆహ్వానం;
గూగుల్ క్లౌడ్ డైరక్టర్ డ్రూ బ్రైన్స్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... విశాఖపట్నంలో డేటా సిటీని ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్ 11న ఎపి ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చకుంది. రాష్ట్రంలోని యువతను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ) వినియోగాన్ని ప్రోత్సహించడానికి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి గూగుల్ మరో ఎంఓయు చేసుకుంది. విశాఖలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పూర్తిచేశాం. సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టండి. గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్ లను రూపొందిస్తున్నందున వైజాగ్ లోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్ లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. గూగుల్ క్లౌడ్ ప్రపంచంలోనే అతిపెద్ద డాటా సర్వర్ వినియోగదారుల్లో ప్రధానమైంది. చైనా/తైవాన్‌కు దూరంగా ఎపిలో తయారీని ప్రారంభించడానికి గూగుల్ ఎపి ద్వారా సర్వర్ సప్లయ్ చైన్ కు కనెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించండి. గూగుల్ క్లౌడ్ లేదా సర్వర్ సరఫరాదారు దాని మరమ్మత్తు, నిర్వహణ సేవలకు గ్లోబల్ హబ్‌గా ఎపిని ఉపయోగించుకోవచ్చు. బలమైన ఎయిర్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ ఉన్నందున అటువంటి కార్యకలాపాలకు ఎపి అనుకూలంగా ఉంటుందని మంత్రి లోకేష్ చెప్పారు. దీనిపై గూగుల్ క్లైడ్ డైరక్టర్ డ్రూ బ్రైన్స్ స్పందిస్తూ... ఇప్పటికే ఎంఓయులు చేసుకున్న ప్రాజెక్టులతోపాటు ఎపి ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.