Piyush Goel : ఆంధ్రప్రదేశ్ లో జీడి, మిర్చి, మామిడి బోర్డులను ఏర్పాటు చేయండి
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ తో నారా లోకేష్ భేటీ;
ఆంధ్రప్రదేశ్ అనేక కీలక వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంది, అయితే రైతులు ఉత్పాదకత, మార్కెట్ అస్థిరత, ఎగుమతి పోటీతత్వంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యను పరిష్కరించి సప్లయ్ చైన్ ను బలోపేతం చేయడానికి ఎపిలో ప్రత్యేక వ్యవసాయ ఉత్పత్తుల బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ తో మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... జీడిపప్పు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండోస్థానంలో ఉంది. ఎపిలో 1.38లక్షల హెక్టార్లలో రైతులు జీడిపంట పండిస్తూ ప్రతిఏటా 1.68 లక్షల మెట్రిక్ టన్నుల జీడిపప్పును ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్కువ వయసు కలిగిన జీడితోటల నుంచి ఉత్పాదకత తగ్గిపోవడం, పంటకోత తర్వాత మౌలిక సదుపాయాల లేమి వంటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాసెసింగ్ ఆధునీకరణ, పారదర్శకతమైన వ్యాపారం ద్వారా రైతులకు మెరుగైన ధరలను అందించేందుకు శ్రీకాకుళంలో జీడి బోర్డు మంజూరు చేయమని విజ్ఞప్తి చేశారు.
ఎపిలో మరో ముఖ్యమైన మిర్చి పంటను 11.67లక్షల హెక్టార్లలో రైతులు సాగు చేస్తున్నారు. ధరల హెచ్చుతగ్గులు, దళారీలపై ఆధారపడటం, పంటకోత నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిర్చి రైతుల ఆదయాన్ని స్థిరీకరించి, ప్రపంచవ్యాప్తంగా మిర్చి ఎగుమతులను పెంచడానికి గుంటూరులో మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి. మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వస్థానంలో ఉంది. ఎపిలో ప్రతిఏటా దాదాపు 50లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి చేస్తున్నారు. బంగినపల్లి మామిడి పళ్లకు జిఐ గుర్తింపు ఉన్నప్పటికీ తక్కువ దిగుబడి, మౌలిక సదుపాయాల లేమి, మార్కెట్ యాక్సెస్ లేకపోవడంతో రైతులు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సప్లయ్ చైన్, ప్రపంచ పోటీతత్వాన్ని బలోపతం చేసేందుకు చిత్తూరులో మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు.
ఆంధ్రప్రదేశ్ కీలకమైన పారిశ్రామిక కారిడార్లతో వ్యూహాత్మక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. ఆయా కారిడార్ల పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నిధులు అవసరం. రాష్ట్రంలోని మూలపేట, చిలమత్తూరు, కుప్పం, దొనకొండలలో 4 కొత్త నోడల్ లను అభివృద్ధి చేసేందుకు అనుమతులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నీరు, విద్యుత్, రోడ్డు, రైలు వంటి మౌలిక సదుపాయాల కోసం రూ.5,811 కోట్ల గ్రాంట్ మంజూరు చేయండి. విజయవాడ చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్ (విసిఐసి) పరిధిలో చిత్తూరు నోడ్ కు అనుమతి ఇవ్వండి. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్ లకు సంబంధించి మాస్టర్ ప్లాన్లు ఇప్పటికే ఆమోదం పొందాయి. రెండు నోడ్ లకు టెండర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈపిసి విడుదలకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (NICDC) ఆమోదం పెండింగ్ లో ఉంది. ఈ ప్రాజెక్టును వెంటనే అమలుచేసి పెట్టుబడులను ఆకర్షించేందుకు వెంటనే అనుమతులు మంజూరు చెయ్యమని లోకేష్ విజ్ఞప్తి చేశారు.