Sharmila: జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని షర్మిల ఆరోపణలు, మోదీ దత్తపుత్రుడిగా విమర్శ

మోదీ దత్తపుత్రుడిగా విమర్శ

Update: 2025-09-11 16:01 GMT

Sharmila: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ అక్రమ రాజకీయ పొత్తు కుదుర్చుకున్నారని, ఆయన మోదీ దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ ఉందని గతంలో ఆరోపించిన జగన్, మోదీ సహకారంతో రిలయన్స్‌కు రాజ్యసభ సీటు ఇప్పించారని షర్మిల విమర్శించారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా అని ఆమె ప్రశ్నించారు.

జగన్‌కు ఐడియాలజీ అనేది మిగిలిందా లేక వైసీపీ బీజేపీ ఐడియాలజీని అనుసరిస్తోందా అని షర్మిల సందేహం వ్యక్తం చేశారు. జగన్ కూటమిలో భాగమైనట్లు ప్రజలందరికీ తెలుసునని, ఆయన ఏ ముఖంతో ప్రజలకు సమాధానం చెబుతారని ఆమె మండిపడ్డారు. జగన్‌కు ధైర్యం ఉంటే, వైసీపీ బీజేపీకి తోక పార్టీ అని ఒప్పుకోవాలని, చేతిపై బీజేపీ పచ్చబొట్టు వేసుకోవాలని షర్మిల ఎద్దేవా చేశారు.

తన కుమారుడు ఇంకా రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని షర్మిల స్పష్టం చేశారు. తన కొడుకు రాజకీయ ప్రవేశంపై వైసీపీ ఇంతగా స్పందిస్తుందంటే వారికి భయమా, బెదురా అని ప్రశ్నించారు. తన కొడుకుకు వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టినట్లు గుర్తుచేసిన షర్మిల, అతడు వైఎస్సార్ వారసుడేనని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను దూరం పెట్టిన నాయకుడని, ఆయన బతికి ఉంటే జగన్ చేసిన పనులకు తలదించుకునేవారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News