Chandrababu Naidu : నిశ్శబ్ద విప్లవం కొనసాగాలి: చంద్రబాబు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ సీయం చంద్రబాబునాయుడు;
2024 ఎన్నికల్లో ‘ప్రజలు గెలవాలి- రాష్ట్రం నిలవాలి’ అనే ఎన్డీయే నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఓ నిశబ్ద విప్లవాన్ని సృష్టించారని అన్నారు. ఈ విప్లవం వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం… రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఇది రెండో స్వాతంత్య్ర దినోత్సవమని.. ఇక, నుంచి జరగబోయే అన్ని స్వాతంత్య్ర దినోత్సవాలు కూటమివేనని ఆకాంక్షించారు. తాము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మ కాన్ని నిలబెట్టేలా, భవిష్యత్‌కు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నామనిసీఎం చంద్రబాబు చెప్పారు. “సంక్షేమం-అభివృద్ది-సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తిని ఇచ్చింది” అని అన్నారు.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమానికి సాటి లేదని తెలిపారు. అదేసమయంలో అభివృద్దికి కూడా అడ్డులేదన్నారు. తమ ‘సుపరిపాలన’కు పోటీ ఇచ్చే శక్తి ఎవరికీ లేదని తేల్చి చెప్పా రు. “ఇది రికార్డ్. ఇదే ఆల్ టైం రికార్డ్.” అని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల హామీలైన సూపర్ 6ను సూపర్ హిట్ చేశామని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి నెలా 1నే పేదల సేవలో.. పేరుతో ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. 4వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనేనని చెప్పారు. ‘సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చాం. ‘ అని చంద్రబాబు తెలిపారు.
‘తల్లికి వందనం’ పథకాన్ని రూ.10 వేల కోట్లతో అమలు చేసినట్టు చంద్రబాబు చెప్పారు. అన్నదాత సుఖీ భవ పథకంలో మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో వేశామని, 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు అందించామని వివరించారు. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్న సీఎం… ఏటా రూ.2,684 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కానుకగా ఇస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు.