Capital Amaravati : అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుంది
సింగపూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన;
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆ దేశ మానవనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా.. గత ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా సింగపూర్ మంత్రి చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంగా ఉండేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ట్రేడ్ ఇండస్ట్రీ శాఖలోని మానవ వనరులు, శాస్త్రసాంకేతిక మంత్రి టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంపై ఎక్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం లాంటి రంగాలు పెట్టుబడులకు అనుకూలమని టాన్సీ లెంగ్ పేర్కోన్నారు. భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో ఫుడ్ ఎంపైర్, ఎవర్ వోల్ట్ లాంటి సింగపూర్ కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు ఆ సంస్థలు ఎదురు చూస్తున్నాయని పేర్కోన్నారు. అలాగే పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులతో పాటు భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు. మరోవైపు 2014-2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పని చేశామని మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు తన ట్వీట్ లో పేర్కోన్నారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని గుర్తు చేశారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ సహకారం ఆగిపోయిందని అన్నారు. సింగపూర్ కన్సార్టియం కూడా అమరావతి ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసిందని టాన్ సీ లెంగ్ తన ట్వీట్ లో పేర్కోన్నారు. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై ఏపీ అభివృద్ధిపై చర్చించినట్టు ఆయన వెల్లడించారు. సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పని చేయకున్నా.. ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో సాంకేతిక సహకారం అందించటంతో పాటు ప్రపంచబ్యాంకు లాంటి భాగస్వాములతో కలిసి ఏపీ అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి పని చేస్తామని టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని కోరుకుంటున్నట్టు సింగపూర్ మంత్రి ట్వీట్ లో పేర్కోన్నారు.
ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం విలువైంది
వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలియచేశారు. ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి, ఆ దేశ మంత్రి టాన్ సీ లెంగ్ కు ఎక్స్ వేదికగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సుస్థిరాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషదాయకమని అన్నారు. వివిధ రంగాల్లో ఏపీ-సింగపూర్ కలిసి పని చేయడానికి టాన్ సీ లెంగ్ తో జరిపిన చర్చలు బాటలు వేశాయని సీఎం పేర్కోన్నారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉత్పాదక రంగం, రెన్యూవబుల్ ఎనర్జీ, పోర్టులు, డిజిటల్, ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పని చేసేందుకు ఈ చర్చలు దోహద పడతాయన్నారు. 90వ దశకం నుంచి సింగపూర్ ప్రభుత్వంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం చాలా విలువై నదని సీఎం తన ట్వీట్ లో పేర్కోన్నారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో.. ఆధునిక మౌలిక వసతుల కల్పనలో సింగపూర్ ప్రభుత్వం నుంచి సహకారం ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. కొన్ని పరిణామాల వల్ల సింగపూర్ భాగస్వామ్యంతో కలిసి చేస్తున్న ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యాయని సీఎం అన్నారు. ఏపీలో అద్భుతమైన ప్రజా తీర్పుతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంకల్పం తీసుకున్నామన్నారు. స్వర్ణాంధ్ర-2047 సాధన దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం వివరించారు. వివిధ రంగాల్లో సింగపూర్ దేశ విధానాలు ఎప్పుడూ స్పూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. పట్టణ, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు సింగపూర్ తోడైతే ప్రజల ఆశలను నెరవేర్చగలమని సీఎం తన ట్వీట్ లో ఆకాంక్షించారు. పరస్పరం గౌరవించుకుంటూ వివిధ రంగాల్లో అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేద్దామని సీఎం పేర్కొన్నారు.