YS Jagan : కూటమి ప్రభుత్వ అరాచకాలను నమోదు చేయడానికి ప్రత్యేక యాప్
పీఏసీ సమావేశంలో కీలక ప్రకటన చేసిన వైఎస్.జగన్మోహన్‌రెడ్డి;
ప్రజలకు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా ఆ వివరాలను నమోద చేయడానికి పార్టీ తరపున త్వరలో ఒక యాప్ విడుదల చేయబోతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రకటన చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో వైఎస్.జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభత్వం నుంచి వేధింపులకు, అన్యాయానికి గురైనవారు, వారికి ఏ విధంగా ఏ అధికారి లేక నాయకుడి వల్ల అన్యాయానికి గురయ్యింది తగిన ఆధారాలతో వెంటనే యాప్ లో నమోదు చేయవచ్చని, ఆ ఫిర్యాదు అటోమేటిక్‌గా మన డిజిటల్ సర్వర్‌లోకి వస్తుందని జగన్ యాప్ పనితీరును వివరించారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాప్ లో నమోదైన ఫిర్యాదులపై ఖచ్చితంగా పరిశీలన చేస్తామని వైఎస్.జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయమని ఈ సందర్భంగా వైఎస్.జగన్ పునరుద్ఘాటించారు. ఈ రోజు చంద్రబాబు ఏ విత్తనమైతే నాటారో రేపు అదే చెట్టవుతుందని మాజీ సీయం తేల్చి చెప్పారు. చంద్రబాబు పాలన ఘోరంగా ఉందని, ప్రలకు ఇస్తానన్న బిర్యాని ఇవ్వకపోగా ఉన్న పలావు పోయినట్లైందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని వైఎస్.జగన్ మండిపడ్డారు. ఇదే సాంప్రదాయం కొనసాగితే భవిష్యత్తులో టీడీపీలో అందరూ జైలుకు వెళ్ళాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి మనకి ఇదే మంచి అవకాశమని వైఎస్.జగన్ అన్నారు. పొలిటికల్ అడ్వైజరీ సభ్యులు పెద్దరికంగా వ్యవహరించి అందరితో కలుపుగోలుగా ఉండాలని సూచించారు. పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. చిన్ని చిన్న విభేదాలు ఉంటే అన్నీ సరి చేసి అందర్నీ ఒక్క తాటిపైకి తీసుకు రావాలని జగన్ పీఏసీ సభ్యులకు చెప్పారు. గతంలోలా కాకుండా రాబోయే రోజుల్లో పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని వైఎస్‌జగన్మోహనరెడ్డి విస్పష్టంగా ప్రకటించారు.