‘Statue of Sacrifice’ in Amaravati: అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్’ : 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రతిష్ఠ

58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రతిష్ఠ

Update: 2025-12-16 11:08 GMT

‘Statue of Sacrifice’ in Amaravati: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భావితరాలకు స్ఫూర్తిగా నిలుపుటకు రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్’ (త్యాగ విగ్రహం)గా పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, 6.8 ఎకరాల విస్తీర్ణంలో ‘పొట్టి శ్రీరాములు స్మృతివనం’ పేరుతో మెమోరియల్ పార్కును అభివృద్ధి చేస్తామని తెలిపారు.

పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ‘పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందినవారు కాదు, తెలుగు జాతి ఆస్తి. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన ఏకైక నాయకుడు ఆయన’ అని కొనియాడారు. తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో చంద్రబాబు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవిత విశేషాలను చిత్రీకరించిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. అమరజీవి కుటుంబ సభ్యులైన గునుపూడి హనుమంతరావు, సత్యనారాయణరావు, నరసింహారావు, సుబ్రహ్మణ్యం, కుందా ప్రతిభలను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

తెదేపానే మొదట గౌరవించింది

పొట్టి శ్రీరాములును తొలుత గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్ 1985లో తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారని, 2003లో నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు పేరు సూచించి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ఆయన పుట్టిన ఇంటిని మెమోరియల్‌గా మార్చి, అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామని, ప్రారంభించిన ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చెన్నైలో ఆయన ప్రాణాలు విడిచిన భవనాన్ని ‘త్యాగ భవనం’గా పరిరక్షిస్తామని చెప్పారు.

ఆర్యవైశ్య సమాజానికి హామీలు

ఆర్యవైశ్యుల కులదైవం వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా గుర్తించామని, పెనుగొండను వాసవీ పెనుగొండగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. గుప్తా, శెట్టి, కోమటి తదితరులకు ఆర్యవైశ్యులుగానే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, సవిత, ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య, బోండా ఉమా, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News