Ambati : సూపర్ సిక్స్‌... సూపర్ ఫ్లాప్.. సీఎం చంద్రబాబుది సూపర్ చీటింగ్

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్;

Update: 2025-08-16 05:40 GMT
  • స్వాతంత్ర్య దినోత్సవం నాడూ చంద్రబాబు అబద్దాలు
  • ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదు
  • అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేసిన ఘనుడు
  • పులివెందుల, ఒంటిమిట్ట గ్రామాల్లో ఓటర్ల వేలిపై సిరాచుక్క లేదు
  • 30 ఏళ్ళ తరువాత స్వాతంత్ర్యం అంటూ సిగ్గులేని మాటలు
  • లోకేష్‌ ట్వీట్‌లో పెట్టిన ఫోటోలోనే దొంగ ఓటర్లు కనిపిస్తున్నారు

స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైనా అబద్దాలనే ప్రజల ముందు మాట్లాడారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్... సూపర్ హిట్ అంటూ ఆయన మాట్లాడింది చూస్తే... చంద్రబాబుది సూపర్ చీటింగ్ అంటూ ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. చివరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీం ప్రారంభంలోనూ ఆంక్షలు పెట్టి, నిస్సిగ్గుగా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని ధ్వజమెత్తారు. తనను గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై అసత్యపు విమర్శలు చేయడం తప్ప కనీసం స్వాతంత్ర్యదినోత్సం నాడు అయినా కొన్ని నిజాలు మాట్లాడతారుని అనుకుంటే, తన సహజ నైజాన్ని చంద్రబాబు మళ్లీ బయట పెట్టుకున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. సూపర్‌సిక్స్‌ సూపర్‌ హిట్ అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు. అసలు సూపర్ సిక్స్... హిట్ ఎలా అయ్యిందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తల్లికి వందనం గత ఏడాది ఎగ్గొట్టారు. 9.7.2024న జారీ చేసిన జీఓలో విద్యార్ధుల తల్లులకు రూ.15వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చాలా స్పష్టంగా రాశారు. ఈ జీఓను ఏడాది తరువాత అమలు చేస్తారా? ఇది మోసం కాదా చంద్రబాబూ? దీనిపై వైయస్ఆర్‌సీపీ వెంటపడటం వల్ల ఈ ఏడాది ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. కొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.6 వేలు ఇలా అరకొరగానే తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం అన్నారు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వారికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు కావాలి. కానీ తొలివిడతలో రూ.895 కోట్లు మాత్రమే కేటాయించారు, ఇక రెండో ఏడాది రూ.2600 కోట్లు కేటాయించారు. అంటే దీనిని ఏమంటారో చంద్రబాబే చెప్పాలి. అన్నదాత సుఖీభవ పథకంను గత ఏడాది ఎగ్గొట్టారు. కేంద్రం ఇచ్చే దానితో కలిసి రూ.26వేలు ఏడాదికి ఇస్తానని చెప్పి, రెండే ఏడాది రూ.7 వేలతో సరిపెట్టారు. నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేలు అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వలేదు. స్త్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఈ రోజు ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడూ అంటూ వైయస్ఆర్‌సీపీ వెంటపడితే తప్ప ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రాలేదు. ఉచిత బస్సు పథకంలోనూ మహిళలను మోసం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పద్నాలుగు నెలల తరువాత పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ కేటగిరిలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అంటూ అవకాశం ఇచ్చారు. పదహారు కేటగిరిల్లో కేవలం ఈ పరిమిత కేటగిరిల్లోనే ప్రయాణించాలని ఆంక్షలు పెట్టడం దారుణం కాదా అని అంబటి ప్రశ్నించారు.

పోలవరంను సర్వ నాశనం చేశారు

వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వల్లే పోలవరం, అమరావతి ఆగిపోయింది అంటూ సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు అబద్దాలు అడుతున్నారు. పోలవరంను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ అయిదేళ్ళ పాలనలో సోమవారాన్ని పోలవరం అనేవాడు. ఇప్పుడు కనీసం అటు వైపు వెళ్ళే ధైర్యం చేయడం లేదు. డయాఫ్రంవాల్ మేం చెడగొట్టామని అబద్దాలు చెబుతున్నాడు. కాఫర్ డ్యాంలను నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించి, దానిని నిర్వీర్యం చేశారని నిపుణుల కమిటీనే చంద్రబాబు నిర్వాకాన్ని ఎత్తి చూపింది. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తానంటూ అబద్దాలు చెబుతున్నాడు. పోలవరం కాంట్రాక్ట్‌ల్లో కమీషన్ల కోసమే చంద్రబాబు దృష్టి పెట్టాడు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశామంటూ మా ప్రభుత్వంపై మాట్లాడారు. ఇదే చంద్రబాబు సీఎంగా అసెంబ్లీలో రూ.6 లక్షల కోట్లు అంటూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ పద్నాలుగు నెలల్లోనే దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పులు చేశాడు. దేని కోసం ఈ అప్పులు చేస్తున్నారు. వైయస్ జగన్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.

ఇంత దుర్మార్గమైన ఎన్నికను ఎప్పుడూ చూడలేదు

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అద్భుతంగా జరిగిందని, ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని పవన్ కళ్యాణ్, లోకేష్‌లు మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక మరెక్కడా జరిగి వుండదు. అక్కడి ఓటర్లను ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా, పక్క గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకువచ్చి, పబ్లిక్‌గా పోలీసుల రక్షణలో రిగ్గింగ్ చేయించారు. ఆధారాలతో సహా బయటపెట్టాం. పదివేల మంది ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్‌లోని గ్రామాల్లో తిరిగి చూస్తే, ఏ ఇంటిలోని ఓటరు వేలిమీద మీకు సిరా మార్క్ కనిపించదు. కారణమేంటంటే, వారి ఓటును కూడా టీడీపీ వారే వేసుకున్నారు. దానిలో స్లిప్‌లు దొరికాయని, ముప్పై ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకోలేదని దానిలో రాసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ స్లిప్ వేసింది జిల్లా కలెక్టరా లేక డీఐజీ కోయ ప్రవీణా తేలాలి. మంత్రి నారా లోకేష్‌ తన ట్వీట్‌లో పెట్టిన ఫోటోలో ఓటు వేస్తున్న క్యూలైన్‌లో ఉన్న వ్యక్తి జమ్మలమడుగు లోని మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆయన వేశాడేమో ఈ స్లిప్. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తమను తాము గొప్పగా చెప్పుకోవడం సిగ్గు చేటు.

Tags:    

Similar News