ఏపీలో ఏఐ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి
ఏఐ సింగపూర్ సంస్థను ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు;
- ఎస్ఐఏ ఇంజినీరింగ్ ప్రతినిధితోనూ భేటీ
- రాష్ట్రంలో విమానయాన రంగంలో అవకాశాలు వివరించిన సీఎం
ఆంధ్రప్రదేశ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పర్యటన 3వ రోజైన మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామ్యంగా పని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలు, ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపైనా చంద్రబాబు-కంకణవల్లి మధ్య చర్చ జరిగింది.
ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుపై చర్చలు
ఎస్ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్‌జీ జాన్ లిన్ విలిన్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను జాన్ లిన్ విలిన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఎంఆర్‌ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా తీసుకువచ్చిన పారిశ్రామిక అనుకూల పాలసీల గురించి తెలిపారు. ముఖ్యంగా విమానయాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచన చేయాలని సీఎం చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎస్ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తర్వలోనే రాష్ట్రానికి తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామని చెప్పారు. ఎస్ఐఏ ఇంజినీరింగ్ వంటి సంస్థల అనుభవం, టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచ స్థాయి ఎంఆర్ఓ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని... ఈ కేంద్రం ఏర్పాటుకు విశాఖపట్నం, కృష్ణపట్నం వంటి ప్రాంతాలు అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.