అభ్యర్థుల తుది జాబితా ప్రకటన 25కు వాయిదా – ఎస్‌ఈసీకి ఆదేశాలు


Supreme Court: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల గడువును పొడిగించాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శాంతిభద్రతలు లేకపోవడం వల్ల నామినేషన్లు దాఖలు చేయలేకపోయామని అభ్యర్థులెవరైనా ఈ నెల 16 నుంచి 18 తేదీల మధ్య సాక్ష్యాధారాలతో విజ్ఞాపనలు లేదా ఫిర్యాదులు చేసి ఉంటే వాటిని పరిశీలించి ఆ ప్రాంతాల్లో మాత్రమే గడువు పెంచే అంశంపై గురువారం సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) ఆదేశించింది.

జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌ల ధర్మాసనం బుధవారం వైకాపా వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)పై విచారణ జరిపి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని, అవసరమైన చోట గడువు పెంచితే 48 గంటల సమయం కల్పించి ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించాలని సూచించింది. అవసరమైన ప్రాంతాల్లో జిల్లా కేంద్రంలో కలెక్టర్ ముందు నామినేషన్లు సమర్పించే ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు, సీసీటీవీ కవరేజీ, అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించేందుకు డీజీపీ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. నామినేషన్ల చివరి తేదీని రాష్ట్రవ్యాప్తంగా మార్చే బ్లాంకెట్ ఆర్డర్ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసి, ఈ ఉత్తర్వులపై తీసుకున్న నిర్ణయాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

వైకాపా తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ 63.57 శాతం అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని, నామినేషన్ పత్రాలు చించేశారని, కార్లు తగలబెట్టారని, ఎంపీని అడ్డుకున్నారని ఆరోపించారు. 723 వార్డుల్లో 263 వార్డుల్లో మాత్రమే నామినేషన్లు దాఖలు చేయనిచ్చారని పేర్కొన్నారు. జస్టిస్ బాగ్చి దీనిపై ప్రశ్నిస్తూ మొత్తం దాదాపు 100 పట్టణ స్థానిక సంస్థల్లో 19 సంస్థల గురించే మాట్లాడుతున్నారని, సంఖ్యల్లో స్పష్టత ఉండాలని, భావోద్వేగాలతో కాకుండా తార్కికంగా చూడాలని సూచించారు. వీడియో క్లిప్‌లు ఉంటే ఎన్నికల అధికారులు, ఎస్‌ఈసీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని, వాటిని సమర్పించి ఎస్‌ఈసీ పరిశీలనకు వదిలేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గడువు పెంచలేమని, సమస్య ఉన్న ప్రాంతాలకే స్పందించగలమని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ వాదనలు వినిపిస్తూ వైకాపా రెండు రిట్ పిటిషన్లు వేసినట్లు, పోలీసు భద్రత, సీసీటీవీలపై ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసినట్లు, హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించిన విషయాన్ని వైకాపా దాచిపెట్టిందని తెలిపారు. మైదుకూరులో ఇబ్బందులు నిర్ధారించి ఎన్నికలను నిలిపేయడం ఎస్‌ఈసీ నిష్పాక్షికతకు ఉదాహరణ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ వైకాపా హింసాత్మక ఘటనలు సృష్టించి కోర్టుకు వెళ్లిందని, ఫిర్యాదులు కాపీపేస్ట్ లాగా ఉన్నాయని, ఏ అభ్యర్థీ నామినేషన్ అడ్డుకోబడిందని హైకోర్టుకు వెళ్లలేదని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కూడా పిటిషనర్‌కు ఎన్నికలకు వెళ్లే ఇష్టం లేదని, మీడియా ప్రచారం కోసం ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా గడువు పొడిగింపు కోరికను తిరస్కరిస్తూనే, నిజమైన ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సాక్ష్యాధారాల ఆధారంగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించింది.

Tags: