Urban Local Body Polls: పట్టణ స్థానిక సంస్థల పోలింగ్‌కు వాయిదా అవకాశం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో షెడ్యూల్ మార్పు
షెడ్యూల్ మార్పు
Urban Local Body Polls: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితాల ప్రకటనను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన నేపథ్యంలో పోలింగ్ తేదీలు మారనున్నాయి. కనీసం మూడు నుంచి నాలుగు రోజులు వాయిదా పడే అవకాశం ఉంది.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అభ్యర్థుల తుది జాబితాను బుధవారం ప్రకటించి, ఈ నెల 28న పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అవసరమైన చోట 29న రీపోలింగ్, 30న ఓట్ల లెక్కింపు చేపట్టాలి. అయితే సుప్రీంకోర్టు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల కారణంగా ఈ షెడ్యూల్లో మార్పులు అనివార్యమయ్యాయి.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని కొత్త పోలింగ్ తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నవంబరు 3న పోలింగ్, అవసరమైన చోట 4న రీపోలింగ్, 5న ఓట్ల లెక్కింపు నిర్వహించాలి. పోలీసు సిబ్బంది ఆ విధుల్లో ఉంటారు కాబట్టి కొంత విరామంతో పురపాలక ఎన్నికలకు కొత్త తేదీలు నిర్ణయించే అవకాశం ఉంది.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి, విపక్ష వైకాపా వర్గాల మధ్య చాలా చోట్ల గొడవలు జరిగినా, నామినేషన్లు వేయలేకపోయినా రాతపూర్వక ఫిర్యాదులు స్వల్ప సంఖ్యలోనే ఉండవచ్చని అంచనా. ఎన్నికల సంఘం ఫిర్యాదుల లెక్కలు తీస్తోంది. గురువారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాల్సి వచ్చినా అది చాలా తక్కువ స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.
పోలింగ్ తేదీలు వాయిదా పడటం వల్ల పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రచారానికి ఎక్కువ సమయం లభిస్తుంది. కూటమి పార్టీల పొత్తులో చిన్న సర్దుబాట్లు, తిరుగుబాటు అభ్యర్థుల బుజ్జగింపులకు కూడా అవకాశం ఏర్పడుతుంది.