Botcha Satyanarayana : కూటమి ప్రభుత్వం విశాఖను దోపిడీ చేస్తోంది

చంద్రబాబు సర్కార్‌పై బొత్స ఆరోపణలు;

Update: 2025-08-01 06:45 GMT

ఐటీ డెవలప్మెంట్‌ పేరుతో కూటమి ప్రభుత్వం విశాఖపట్నాన్ని దోచుకుంటోందని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు సర్కార్‌ అరాచక పాలన, విశాఖలో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దోపిడీ వ్యవహారలతో పాటు పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఇష్టానుసారం దాడులు చేస్తూ హత్యలకు పాల్పడుతున్నారని బొత్స విమర్శించారు. గడచిన మా ఐదేళ్ళ పాలనతో చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే క్రైమ్‌ రేటు అధికంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తుంటే కూటమి నేతల్లో అసహనం పెరిగిపోతోందని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బొత్స అన్నారు. మంత్రులు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళితే కార్యకర్తలెవరు ఆయన్ను కలవకుండా రోడ్లపై గుంతల తవ్వడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుక దిక్కు లేదు కానీ కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లూలూ సంస్ధకు భూములు కేటాయించే విషయంలో ప్రభుత్వం లాలూచీ పడిందని బొత్స ఆరోపించారు. రూ.1500 కోట్ల విలువైన స్ధలాన్ని లులూ కంపెనీకి 99 సంవత్సరాల కాలానికి అప్పగించడం ఏంటని బొత్స ప్రశ్నించారు. భూమి విలువలో సగం కూడా లూలు కంపెనీ నుంచి పెట్టుబడులు రావని బొత్స అన్నారు. అదేవిధంగా టీసీఎస్‌కు కూడా అప్పనంగా భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించింది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అని బొత్స చెప్పారు. మా హయాంలో మేము డేటా సెంటర్‌ పెట్టలేదా, కొత్తగా మీరే డేటా సెంటర్‌ తెచ్చినట్లు ఎందుకు చెప్పుకుంటున్నారు అని బొత్స కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో విశాఖలో అభివృద్ధి జరగడం లేదని, దోపిడీ జరుగుతోందని బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News