మహిళల రక్షణ, సాధికారతే జాతీయ మహిళా కమిషన్ లక్ష్యం
- మహిళలపై దాడులకు పాల్పడితే శిక్ష తప్పదు
- మహిళా కమిషన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది
- పది మంది సిబ్బంది ఉన్న సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి
- బాలికల రక్షణ కోసం చర్యలు తీసుకుంటాము
- డాక్టర్ అర్చన మంజుందార్, జాతీయ మహిళా కమిషన్ మెంబర్
బాలికలు, మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కు మహిళా కమిషన్ కృషి చేస్తుందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్. అర్చన మజుందార్ అన్నారు. దేశంలో ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. జాతీయ మహిళా కమిషన్ మూడు రోజుల రాష్ట్ర పర్యటన లో భాగంగా మొదటి రోజు మంగళవారం విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పాత ప్రభుత్వ వైద్యశాలను జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డాక్టర్. అర్చన మజుందార్ సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ అర్చన మజుందార్ మాట్లాడుతూ మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేసినా, దాడులు చేసినా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది పనిచేస్తున్న ఏ వ్యాపార సంస్థలైనా, విద్యాసంస్థలైనా, కార్యాలయాలైనా తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆ కమిటీని సీనియర్ మహిళా ఉద్యోగిని ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల రక్షణ కోసం 24 గంటలు మహిళా కమిషన్ అందుబాటులో ఉంటుందని, బాధితులు ఏ సమయమైనా తమకు ఫిర్యాదు చేయవచ్చని, తక్షణం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలు, మహిళల రక్షణ కోసం, వారి సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఐసీసీ(ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ) ఏర్పాటు చేశారా లేదా అని జాతీయ మహిళా కమిషన్ మెంబర్ అర్చన మజుందార్ వాకబు చేశారు. వారం రోజుల్లో ఐసీసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే కళాశాలలో మహిళ రక్షణ చర్యలపై డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని, హెల్ప్ లైన్ నెంబర్ లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు, కళాశాల ఉద్యోగులు, ప్యాకల్టీల సమస్యలను మొదట ఐసీసీ కమిటీ లో పరిష్కరమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.