Ap Cm Chandrababu Naidu : సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది

పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు;

Update: 2025-08-08 05:00 GMT
  • నాడు పెట్టుబడులు అడిగాను... నేడు పేదలకు సాయం చేయాలని కోరుతున్నాను
  • నాటి జన్మభూమి సమాజం కోసం... నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం
  • పేదల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు

సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా గతంలో కోరేవాడినని.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంతో పాటు.. పేదలకు సాయం చేయాలని కూడా అడుగుతున్నానని చెప్పారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం పీ4 జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులుగా ఉండాలని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..”పీ4 కార్యక్రమం గురించి తలుచుకున్న ప్రతిసారి కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయగలం. నాది సుదీర్ఘ రాజకీయ జీవితం. జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపించాం. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన ఆంధ్రప్రదేశ్ లో, జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా క్రియాశీలంగా పని చేశాం. ఎన్నో సంస్కరణలు తెచ్చాను. కానీ ఎప్పుడూ కలగని తృప్తి.. పీ4 కార్యక్రమం ద్వారా కలుగుతోంది. సంస్కరణల వల్ల సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడితే చాలు అవి అతి పెద్ద ప్రాజెక్టులుగా ఉండేవి.. కానీ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల వల్లే ఇది సాధ్యమైంది. 1995లో టెక్నాలజీలో వచ్చిన సంస్కరణల ద్వారా ఫలాలను అందిపుచ్చుకున్నాం. ఆర్థిక సంస్కరణలను కొందరు అందిపుచ్చుకున్నారు. కొందరు వెనుకబడ్డారు. సంస్కరణలను అందిపుచ్చుకున్న వారు ఉన్నత స్థానానికి చేరారు. అంబేద్కర్, ఎన్టీఆర్, అబ్దుల్ కలాం, మోదీ వంటి వారు సామాన్య కుటుంబాల్లోనే పుట్టారు. నాతో సహా ఈ సమావేశంలో ఉన్న చాలా మంది సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచే వచ్చారు. నాడు సమాజం నుంచి ఎంతో సహకారాన్ని అందుకున్నాం.. ఉన్నతస్థితికి చేరాం. ఇప్పుడు అసమానతలు లేని సమాజం కోసం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు చేసేది చిన్న సాయమే కావచ్చు.. పేదరికంలో ఉన్నవారికి ఆ సాయమే అతి పెద్ద ఆలంబనగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు.

ప్రభుత్వానిది సంక్షేమం.. పారిశ్రామిక వేత్తలది సాయం..

మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చేసి చూపించాలనే ఉద్దేశంతో నేను కూడా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నాను. మార్గదర్శిగా నిలిచాను. బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు నా సహచర మార్గదర్శకులతో పోటీ పడతా. ఇప్పటి వరకు 10,81,281 మంది కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. అనేక సంస్కరణలు వచ్చినా.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా.. ఇంకా పేదరికం ఉంటూనే ఉంది. పేదరిక నిర్మూలన చేపట్టాలనే ఆలోచన నుంచే పీ4 పుట్టింది. ఎంత సంపాదించినా ఇక్కడే వదిలి పెట్టి వెళ్లాలి.. అందుకే గివ్ బ్యాక్ పాలసీని అమలు చేయగలిగితే...సమాజానికి మరింత మంచి చేసిన వాళ్లు అవుతారు. పేదరికంలో ఉన్నవాళ్లకి చేయూతనివ్వాలి.. వాళ్లకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి. సరైన సమయంలో గైడ్ చేయగలిగితే.. పేదరికంలో ఉన్న వాళ్లు కూడా మంచి స్థాయికి వెళ్లడానికి అవకాశం కల్పించినవారవుతారు. ప్రాధాన్యత క్రమంలో బంగారు కుటుంబాలకున్న అవసరాలపై సర్వే చేయించాం. ప్రభుత్వం వైపు నుంచి చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పించన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇచ్చాం, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నాం. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందివ్వనున్నాం. ప్రభుత్వ పరంగా మేం చేయాల్సిదంతా చేస్తున్నాం.. ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా బాధ్యత తీసుకుంటే దత్తత కుటుంబాల్లో స్కిల్స్ పెంపొందించడం ద్వారా వారి ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చు. బంగారు కుటుంబాలను కూడా మీ కుటుంబాలుగా భావించి సాయం చేయండి.” అని చంద్రబాబు కోరారు.

పీ4లో కో-స్పాన్సర్ విధానాన్ని తెస్తున్నాం...

సమాజంలో మనతో ఉన్నవాళ్లు.. పేదరికంతో ఇబ్బందులు పడుతూ ఉండడం మంచిది కాదు. అవనిగడ్డలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు కూడా మార్గదర్శిగా ఉండేందుకు ముందుకు వచ్చి.. ఓ పేద వృద్ధురాలిని ఆదుకునేందుకు సిద్దమైంది. నేను ఎవర్ని బలవంతం పెట్టడం లేదు. బాధ్యతగా చూడాలనే చెబుతున్నాను. సాయం చేయడంలో రకరకాలు ఉంటాయి.. ఇటీవల కాలంలో కొందరు టీచర్లు ముందుకు వచ్చారు. చదువు చెప్పడం ద్వారా పేదల ఎదుగుదలకు తోడ్పడతామని చెబుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కో-స్పాన్సర్స్ విధానాన్ని తెస్తున్నాం. ఆర్థిక సాయం చేసే వారు చేస్తారు.. అలాగే విజ్ఞానాన్ని అందించే వారు కూడా ఆ దిశగా కృషి చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విజన్ 2020 రూపకల్పన చేశాను. నన్ను విమర్శించారు. కానీ ఇప్పుడు ఆ విజన్ నిజమైంది. లక్ష్యంతో పని చేస్తే ఏదైనా సాధ్యం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా తెలుగువారిని ప్రపంచంలో అగ్రభాగాన నిలబెట్టే ఆలోచనలు చేస్తున్నాం. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళ్తున్నారు. త్వరలోనే భారత్ ప్రపచంలో మూడో పెద్ద ఎకానమీగా ఎదగబోతోంది. భవిష్యత్తులో భారత దేశం ఎకానమీలో నెంబర్-1 స్థానంలో ఉంటుంది. అభివృద్ధి ఫలాలు అందరికి అందాలనే ఉద్దేశంతో సంస్కరణలు అమలు చేస్తున్నాం.” అని చంద్రబాబు వివరించారు.

Tags:    

Similar News