ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్ ల బదిలీలకు రంగం సిద్దం

అధికార యంత్రాంగం బదిలీలపై కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు;

Update: 2025-07-06 07:51 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలకు రంగం సిద్దం అయ్యింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తైన నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని పునర్‌ వ్యవస్ధీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గడచిన పక్షం రోజులుగా అఖిల భారత సర్వీసులకి చెందిన అధికారుల బదిలీలపై కసరత్తు ప్రారంభించారు. పాలన చేపట్టి ఏడాది కావస్తున్నా పాలనా వ్యవస్ధలో లోపాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. దీనికి తోడు చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో పనిచేస్తున్న కార్యదర్శలు, ముఖ్య కార్యదర్శులతో పొసగడం లేదు. ఐఏఎస్‌ లు తమ మాట వినడం లేదని, తమను లెక్క చేయడంలేదని ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. అదే సమయంలో చాలా జిల్లాల్లో కలెక్టర్లు కూడా శాసనభ్యులను పట్టించుకోవడం లేదని కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యలో సీయం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో ఊకుమ్మడిగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగి చాలా కాలం అయ్యింది. పాలనా వ్యవస్ధలో చేస్తున్న మార్పులు, నూతనంగా ప్రవేశపెడుతున్న పథకాలు, ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా అనుభవం, అర్హతలను బట్టి అధికారులకు పోస్టింగ్‌ ఇవ్వడం పరిపాటి. ఈ క్రమంలోనే చంద్రబాబు భారీగా అధికార యంత్రాంగం రిషఫుల్‌ కి సిద్దపడుతున్నారు.

ప్రధానంగా చాలా కాలంగా ఒకే జిల్లాలో పని చేస్తున్న ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు ఈసారి బదిలీల్లో స్థానభ్రంశం తప్పదు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు పదికి పైగా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కీలక శాఖలకు సంబంధించిన కార్యదర్శలు, ముఖ్యకార్యదర్శలను కూడా బదిలీ చేయనున్నారు. కరెక్ట్‌ ఆఫీసర్‌ ఇన్‌ కరెక్ట్‌ పొజీషన్‌ అన్న పద్దితిలో అన్నీ పరిశీలించి బదిలీలపై చంద్రబాబు కసర్తు పూర్తి చేసినట్లు చెపుతున్నారు. ఇప్పటికే బదిలీలపై కసరత్తు పూర్తి చేయడంతో ఈవారంలోనే భారీ స్ధాయిలో బదిలీలు చేయనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News