YSJagan Nellore Tour : ఏపీలో ఎమర్జెన్సీ పరిస్ధితులు ఉన్నాయి – వైఎస్‌.జగన్‌

ప్రస్తుత పాలన చంద్రబాబు శాడిజానికి నిదర్శనం;

Update: 2025-07-31 10:10 GMT

కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ పరిస్ధితులు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. గురువారం వైఎస్‌.జగన్‌ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖాత్‌ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రశన్నకుమార్‌ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన్ను, ఆయన కుటుంబం సభ్యులను పరామర్శించారు. ఇటీవల కొంత మంది దుండుగులు ప్రశన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్‌.జగన్‌ మీడియాతో మాట్లాడుతూ నేను మా పార్టీ వాళ్ళని పరామర్శించడానికి వస్తే తప్పేముందని, చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంత ఉలిక్కిపడుతోందని వైఎస్‌.జగన్‌ ప్రశ్నించారు. నన్ను కలవడానికి మా పార్టీ శ్రేణులు, అభిమానులు కలవకుండా రోడ్లపై గుంతలు తవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. వేలమంది పోలీసులు, డీఐజీలు, డీఎస్పీలు ఇక్కడకి వచ్చారని అయితే వీరంతా నా భద్రత కోసం కాకుండా పార్టీ క్యాడర్‌ని, అభిమానులని ఆపడానికి వచ్చారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడూ నేడూ ఆగిపోయింది… ఇంగ్లీషు మీడియం ఆగిపోయింది, అన్ని పథకాలు ఆపేసి వ్యవస్ధలన్నింటినీ నిర్వీర్యం చేసేసిందని మండిపడ్డారు. తాము చేస్తున్న ఆరాచక పాలన గురించి ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడిపి ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారని వైఎస్‌.జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యి, మంత్రిగా కూడా పనిచేసిన ప్రశన్న కుమార్‌ రెడ్డి ఇంటిపైకి 80 మంది గూండాలను పంపి దాడి చేయించారని మండిపడ్డారు. మారణాయుధాలత ఇంట్లోకి ప్రవేశించి వారు చేసిన దాడిని చూసి ప్రశన్న కుమార్‌ తల్లి భయంతో వణికి పోయారన్నారు.ఆ సమయంలో ప్రశన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది… ఉండి ఉంటే చంపి ఉండేవారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరకంగా ఇళ్లపై దాడులు ఏంటి, మనుషులను చంపాలని చూడటమేంటని వైఎస్‌.జగన్‌ కూటమి నాయకులను నిలదీశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలు గతంలో ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవన్నారు. మా పార్టీ మహిళా నేతలు విడదల రజని, ఆర్కేరోజా, ఉప్పాడ హారిక వంటి వాళ్ళ పట్ల టీడీపీ నేతల వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయో రాష్ట్రం అంతా చూశారని జగన్‌ చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారని విమర్శించారు. ఒక రాజకీయ నాయకుడు తన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను వాట్సప్‌లో షేర్లు చేస్తే కేసులు పెట్టాస్తారా అని వైఎస్‌.జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు నరనరాన శాడిజంతో నిండిపోయిందనడానికి ఈ సంఘటనే నిర్శనమని వైఎస్‌జగన్‌ అన్నారు. టీడీపీ నేతల సాక్ష్యంతో కేసులు పెట్టడం, టీడీపీ నేతల దాడులకు గురైన వారిని పరామర్శిస్తే కేసులు పెట్టడం కన్నా అన్యాయమైన పరిస్ధితులు ఎక్కడైనా ఉంటాయా అని జగన్‌ అన్నారు. రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియాకు అసలైన డాన్‌ చంద్రబాబునాయుడే అని వైఎస్‌.జగన్‌ విమర్శించారు.మద్యం కమీషన్లను చంద్రబాబు ఎమ్మెల్యేలు పంచుకుంటున్నారని వైఎస్‌జగన్‌ ఆరోపించారు. నందిగం సురేష్‌, వల్లభనేని వంశీలను జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏదైతే విత్తారో పేరు అదే మొక్క అవుతుందన్నారు. ఎల్లాకాలం మీ ప్రభుత్వం ఉంటుందనే భ్రమల్లో ఉండవద్దని కూటమి నేతలకు హితవు పలికారు. కళ్ళు మూసి తెరిచేలోపు మూడేళ్ళు ఇట్టే గడిచిపోతాయని, మేము అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకి, చంద్రబాబు అడుగులకి మడుగులొత్తుతున్న అధికారులకు అన్ని లెక్కలు సరిచేసి చట్టం ముందు నిలడెతామని వైఎస్‌.జగన్‌ పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News