Ap Liquor Scam : రూ.11 కోట్లతో నాకు సంబంధం లేకపోయినా నాకు లింకు పెడుతున్నారు
ఏపీబీ న్యాయమూర్తి ఎదుట కన్నీరు పెట్టుకున్న రాజ్‌కసిరెడ్డి;
తెలంగాణ రాష్ట్రంలోని ఫామ్ హౌస్‌లో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లను ఫొటోగ్రాఫ్ తీయాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని వ్యవసాయ క్షేత్రంలో పోలీసులకు దొరికిన రూ.11 కోట్లతో నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నాకు లింకు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. నేటి శుక్రవారంతో లిక్కర్ కేసు నిందితుల రిమాండ్ గడువు మిగియడంతో పోలీసులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ముందు రాజ్ కసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఎవరి డబ్బులు దొరికినా అవి లిక్కర్ పైసలే అని సిట్ అధికారులు చూపిస్తున్నారని, హైదరాబాద్‌లో పట్టుకున్న 11 కోట్ల రూపాయలకు నాకూ ఎటువంటి సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి న్యాయమూర్తికి విన్నవించారు. సిట్ అధికారులు అ డబ్బులు నావే అని అబద్దం చెపుతున్నారని, 2024 జూన్ మాసంలో ఆ డబ్బులు నేను వరుణ్ కి ఇచ్చినట్లు చెపుతున్నారని, నేను పుట్టకు ముందు కొన్న ఆస్తులను కూడా నా బినామీ ఆస్తులుగా చూపిస్తున్నారని రాజ్ కసిరెడ్డి జడ్జి ముందు వాపోయారు. నా వస్సు 43 సంవత్సరాలు కాగా 45 సంవత్సరాల క్రితం ఉన్న ఫామ్ హౌస్‌కు నేను బినామీ అని సిట్ చెపుతోందని నేను పుట్టక ముందే నాకు బినామీ ఆస్తులు ఉంటాయా అని తన వాదనలను న్యాయమూర్తికి వినిపించారు. హైదరాబాద్ ఫామ్ హౌస్‌లో దొరికిన 11 కోట్లు నేను స్వయంగా వరుణకి ఇచ్చినట్లు చెపుతున్నారని ఆ డబ్బులపై వేలి ముద్రలు చెక్ చెయ్యాలని రాజ్ కసిరెడ్డి న్యాయమూర్తిని అభ్యర్ధించారు. ఆ నోట్లు ఆర్డీఐ ఎప్పుడు ముద్రించిందో తనిఖీ చేసి ఆ నోట్లపై నెంబర్లను రికార్డ్ చేయాలని కోరారు. నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను అటాచ్ చేసి ఆ ఆస్తులు లిక్కర్ ముడుపులతో కొన్నట్లు చెపుతున్నారని, ఇవన్నీ నా బెయిల్ అడ్డుకోవడానికి అబద్దాలు చెపుతున్నారని ఏసీబీ న్యాయమూర్తి ఎదుట రాజ్ కసిరెడ్డి కన్నీళ్ళు పెట్టుకున్నారు. రాజ్ వాదనలు విన్న న్యాయమూర్తి సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లను ఫొటోగ్రాఫ్ తీయాలని ఆదేశాలు ఇచ్చారు.