Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
జిసిసి గ్లోబల్ లీడర్లతో మంత్రి నారా లోకేష్ రోడ్ షో!;
మరో ఆరునెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఎపి ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో పేరెన్నిగన్న దిగ్గజ జిసిసి సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం. టిసిఎస్, ఐబిఎం, ఎల్ అండ్ టి వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలోనే తొలిసారిగా ఎపి రాజధాని అమరావతిలో మరో ఆరునెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతోంది. ఇది భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్ గా నిలుస్తుంది. మరోవైపు విశాఖ మహానగరం ఐటి హబ్ గా తయారవుతోంది. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రస్తుతం ఎపిలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు అందజేస్తున్నాం. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఎపిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. ఈ రోడ్ షోలో లోవ్స్ ఇండియా ఎండి అంకుర్ మిట్టల్, రోల్స్ రాయ్స్ వైస్ ప్రెసిడెంట్ హరిహరన్ గణేశన్, శాక్స్ గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మధు నటేశన్, జెసి పెన్నీ ఇండియా ఎండి కౌశిక్ దాస్, లులూ లెమన్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ మైసూర్, డెల్టా ఎయిర్ లైన్స్ డైరక్టర్ సైఫ్ అహమ్మద్ షరీఫ్, విక్టోరియా సీక్రెట్ వైస్ ప్రెసిడెంట్ వసుధారిణి శ్రీనివాసన్, నసుని ఇండియా సీనియర్ డైరక్టర్ పెద్దరెడ్డెప్ప, ఎఎన్ జె సిఎఫ్ఓ కవితా రమేష్, ఆస్ట్రల్ ల్యాబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివానంద ఆర్. కోటేశ్వర్, జాగ్వర్ ల్యాండ్ రోవర్ సిఇఓ లలితా ఇంద్రకంటి, ఏపీ ఐటి శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.