Tirumala: తిరుమల: పరకామణి కేసులో ఆస్తులు రాయించుకున్నవారు ఎవరు? ప్రముఖుల పేర్లు బయటపడతాయా?

ప్రముఖుల పేర్లు బయటపడతాయా?

Update: 2025-09-21 07:14 GMT

Tirumala: వైకాపా పాలనలో తిరుమల పరకామణిలో సంభవించిన కోట్ల రూపాయల కుంభకోణం వెనుక దాగిన వారిని బయటపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామికి సమర్పించిన కానుకలను దారి మళ్లించిన ఈ కేసులో సీఐడీ విచారణ ప్రారంభమవుతోంది. పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడిన నిందితుడి నుంచి కొన్ని ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు విరాళంగా ఇప్పించి, మిగిలినవాటిని అప్పటి ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు బినామీల పేరిట రాయించుకున్నారనే ఆరోపణలు రచ్చకెక్కాయి. దేవుని సొమ్మును ఒక్క రూపాయి దొంగిలించినా చట్టపరమైన శిక్ష విధించాలి, కానీ ఈ కేసును లోక్ అదాలత్‌లో పెట్టి త్వరగా రాజీ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల ఒత్తిడితోనే రాజీ చేయించారని అప్పటి సహాయ విజిలెన్స్ మరియు భద్రతా అధికారి (ఏవీఎస్వో) విజిలెన్స్ విచారణలో వెల్లడించారు. ఆ పోలీసులు ఎవరు? ఏవీఎస్వోపై ఒత్తిడి ఎందుకు? కోట్ల విలువైన ఆస్తులు ఎవరు దోచుకున్నారు? వంటి ప్రశ్నలకు సీఐడీ విచారణలో సమాధానాలు లభించనున్నాయి.

అసలు సంఘటన ఏమిటి?

తిరుమల పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి ఒక మఠం తరఫున పని చేసేవాడు. అతడు గుమస్తాగా పనిచేస్తూ విదేశీ కరెన్సీ లెక్కలు చూసేవాడు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని దారి మళ్లించారనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీ లెక్కిస్తుండగా కొన్ని నోట్లను తన పంచెలో దాచుకున్నాడు. సిబ్బంది అనుమానంతో తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. అప్పటి ఏవీఎస్వో సతీష్‌కుమార్ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అతడు 900 డాలర్లు (సుమారు రూ.72 వేలు) అపహరించాడు. అయితే, దొరికినవి 112 నోట్లు కానీ, రికార్డుల్లో 9 మాత్రమే చూపారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా దీర్ఘకాలంగా దొంగతనాలు చేసి రవికుమార్ కోట్లాది ఆస్తులు సమకూర్చుకున్నాడని చెబుతున్నారు. దీనిని తెలుసుకున్న వైకాపా నాయకులు లోక్ అదాలత్‌లో రాజీ చేయించి అతని ఆస్తులు దోచుకున్నారని ఆరోపణలు.

శ్రీవారికి కొంత ఇచ్చి.. మిగతా ఆస్తులు దోచుకున్నారు

దొంగతనం చేస్తూ పట్టుబడిన రవికుమార్ మరియు అతని భార్య పేరిట ఉన్న కొన్ని ఆస్తులను తితిదేకు గిఫ్ట్ డీడ్‌గా ఇప్పించారు.

తిరుపతి రూరల్ పరిధిలో డాక్యుమెంట్ నంబర్లు 2563/2023, 2569/2023, 2570/2023, 2571/2023, 2572/2023; తమిళనాడులో త్యాగరాజనగర్‌లో 1507/2023, నీలంగరైలో 6480/2023 ద్వారా తితిదేకు రిజిస్ట్రేషన్ చేశారు.

ఇవే కాకుండా, నిందితుడు మరియు అతని కుటుంబసభ్యుల పేరిట తిరుపతి, చుట్టుపక్కల, చెన్నైలో ఉన్న కోట్ల విలువైన ఆస్తులను అప్పటి ఉన్నతాధికారులు, నాయకులు బినామీల పేరిట రాయించుకున్నారని ఆరోపణలు.

దీంతో నిందితుడిని అరెస్టు చేయకుండానే 2023లో లోక్ అదాలత్‌లో రాజీ చేశారు.

రాజీ కోసం ఏవీఎస్వో సతీష్‌కుమార్‌పై పోలీసులు ఒత్తిడి చేశారు, ఇది విజిలెన్స్ విచారణలో బయటపడింది.

Tags:    

Similar News