Hope on Hope off Buses : పర్యాటకులు పర్యావరణ హితంగా వ్యవహరించాలి

విశాఖ బీచ్‌ రోడ్డులో హోప్‌ ఆన్‌ హోప్‌ ఆఫ్‌ బస్సులను ప్రారంభించిన సీయం చంద్రబాబు;

Update: 2025-08-29 10:03 GMT

ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో విశాఖపట్నం పోటీ పడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో విశాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను సీయం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. రామకృష్ణా బీచ్‌ నుంచి తొట్లకొండ వరకూ 16 కిలో మీటర్ల బీచ్‌ రోడ్‌లో ఈ డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు తిరుగనున్నాయి. ఈ బస్సులు ప్రారంభించిన అనంతరం ప్రజాప్రతినిధులు, పర్యాటకులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొంత దూరం ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా సీయం చంద్రబాబు మాట్లాడుతూ హోప్‌ ఆన్‌ హోప్‌ ఆఫ్‌ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించడానికి రూ.500 ధరను నిర్ణయించారని, అయితే పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తన్ని ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకున్నామని సీయం తెలిపారు. రూ.500 కాకుండా రూ.250 మాత్రమే చెల్లించి 24 గంటల పాటు టెక్కెట్‌ వర్తించేలా ఆదేశాలు ఇస్తున్నామని సీయం ప్రకటించారు. పర్యాటకులు అందరూ పర్యావరణ హితంగా వ్యవహరించాలని సీయం సూచించారు. మన తీర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీయం చెప్పారు. ప్రపంచ పర్యాటకులని ఆకర్షించేలా ఈ బీచ్‌లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలని సీయం కోరారు. విశాఖను రాజధాని చేస్తామని గత పాలకులు చెబితే అవసరం లేదని మీరు తీర్పు ఇచ్చారని సీయం అన్నారు. రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిలోనే కొట్టుకుపోయారని చెప్పారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఆసియా టెక్నాటజీ హబ్‌గా ఎదగబోతోందని సీయం తెలిపారు. విశాఖలో డేటా సెంటర్‌, సీ కేబుల్‌ వేస్తారని, ఈ కేబుల్‌ ద్వారా విశా్‌ఖతో మిగితా ప్రపంచం అనుసంధానం అవుతుందన్నారు. భారతదేశానికే టెక్నాలజీ హబ్‌గా విశాఖ ఎదుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖపట్నం ఎంపికవ్వడం మనం అంతా గర్వపడే అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

Tags:    

Similar News