CM Chandrababu: ఏపీని ఆదాయ హబ్‌గా మార్చాలి: సీఎం చంద్రబాబు

హబ్‌గా మార్చాలి: సీఎం చంద్రబాబు

Update: 2026-02-21 14:11 GMT

CM Chandrababu: గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31లోగా చెత్త సేకరణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేస్తున్నామని, వారానికి ఒకసారి గ్రామాలకు ఈ రథం వచ్చి చెత్తను సేకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి సీఎం హాజరై, స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. అలాగే, ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.

‘‘స్వచ్ఛ రథం వచ్చిన సమయంలో పాత వస్తువులను అందజేస్తే, బదులుగా నిత్యావసర సరుకులు అందుతాయి. దీంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మీకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. 2025 జనవరిలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారాయణల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పచ్చదనం, పరిశుభ్రత, నీరు-మీరు వంటి అంశాలతో ప్రజల మధ్యకు వస్తున్నాం. పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు 108 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోయి ఉంది. దానిని క్రమంగా తొలగిస్తున్నాం. వర్షాకాలంలో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. కలుషిత నీటిని తాగితే డయేరియా లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.

ప్రతి నెల మూడో శనివారం ఎక్కడున్నా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాను. మున్సిపాలిటీల్లో ఇంటింటికీ చెత్త సేకరణ 100 శాతం జరుగుతోంది. మార్చి 31లోగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెత్త సేకరణ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తుంది. రాబోయే కాలంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురానుంది. ఇప్పటికే ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలు విజయవంతమయ్యాయి. ‘పేదల సేవలో’ కార్యక్రమం ద్వారా మొదటి తేదీనే ఇంటికి వచ్చి సేవలు అందిస్తున్నాం. పిల్లల సంఖ్యకు తగ్గట్టుగా ‘తల్లికి వందనం’ కింద ఆర్థిక సాయం చేస్తున్నాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నాం. లాభదాయక పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం. రైతులకు సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం. వ్యవసాయ నిపుణులను రైతులకు అందుబాటులో ఉంచుతున్నాం. రైతులు సాంకేతికతను స్వీకరిస్తున్నారు. మైక్రో ఇరిగేషన్‌, బిందు సేద్యం వంటి కార్యక్రమాలను నేనే మొదట ప్రారంభించాను. వారసత్వ పంటలు మాత్రమే సాగు చేస్తే ఆదాయం తగ్గుతుంది. రాయలసీమను ఉద్యానవన హబ్‌గా మారుస్తున్నాం. ప్రతి ఒక్కరికీ అన్నం అందాలనే లక్ష్యంతో రూ.5కే భోజనం అందిస్తున్నాం. మెరుగైన జీవన ప్రమాణాల కోసం పీ4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఆదాయాన్ని పెంచే మార్గాలను బోధిస్తూ ప్రజలను ఆదుకుంటున్నాం.

కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటాను. మన రాష్ట్రం ఆదాయానికి చిరునామాగా మారాలి. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గుర్తించాలి. దిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌కు కాంగ్రెస్‌ వారు అడ్డంకులు సృష్టించారు. నిన్న దిల్లీలో కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రవర్తన చూసి తీవ్రంగా బాధపడ్డాను. దేశానికి మేలు చేసే కార్యక్రమాలకు అందరూ సహకరించాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News