Treason Case: రఘురామపై దేశద్రోహం కేసు నమోదు: అసలు ఏం జరిగింది?
అసలు ఏం జరిగింది?
Treason Case: మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం కేసు నమోదు చేసేంత కుట్ర లేదా నేరం జరిగిందా? ఇలాంటి నాన్‌బెయిలబుల్ కేసు పెట్టాలని ఎవరు సూచించారు? ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం ఎవరిచ్చారు? అక్కడికి వెళ్లిన బృందాన్ని ఎవరు ఎంపిక చేశారు? సీఐడీ కార్యాలయంలో కస్టడీలో ఉన్న ఆయన వద్దకు మీరు ఎందుకు వెళ్లారు? కస్టడీ నుంచి కోర్టుకు కుంటుతూ వచ్చినంత గాయాలు ఎలా వచ్చాయి? చిత్రహింసలు జరిగాయా ఎవరు చేశారు? – ఇలాంటి ప్రశ్నలతో ఈ కేసులో నిందితుడైన బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి, అప్పటి సీఐడీ డీఐజీ సునీల్ నాయక్‌ను విచారణాధికారి దామోదర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానాలు ఇచ్చినప్పటికీ, చాలా వాటికి మాత్రం మౌనంగా ఉండిపోయారని సమాచారం.
హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు రోజుల విచారణలో భాగంగా, గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో రోజు కూడా సునీల్ నాయక్‌ను విచారించారు. దేశద్రోహం కేసు నమోదు వెనుక ఎవరి ప్రోత్సాహం ఉంది? మీరు ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు? అని ప్రశ్నించగా, ఉన్నతాధికారుల సూచనల మేరకే తాను దర్యాప్తు చేశానని సునీల్ నాయక్ సమాధానమిచ్చారు.
కస్టడీలో డీఐజీ ఎందుకు వెళ్లారు?
సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో రఘురామకృష్ణరాజును కస్టడీలో ఉంచిన సమయంలో, డీఐజీగా ఉన్న మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు? రాత్రి 10:30 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అక్కడ ఏం చేశారు? అరెస్టు సమయంలో ఆయన ఒంటిపై గాయాలు ఉన్నాయా? చిత్రహింసలు పెట్టి హత్యాయత్నం చేయాలని ఎవరైనా ఆదేశించారా? టార్చర్ చేయకపోతే ఆయనకు దెబ్బలు ఎలా తగిలాయి? – ఇలా పలు ప్రశ్నలు సంధించారు విచారణాధికారి. దీనికి సునీల్ నాయక్, తానే స్వచ్ఛందంగా వచ్చానని, ఎవరి ప్రమేయం లేదని, ఎస్పీ గదిలోనే ఉన్నానని చెప్పారు. అయితే, మిగతా అనుబంధ ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వలేకపోయారని తెలుస్తోంది.
ఆ రోజు రాత్రి సీఐడీ కార్యాలయంలో ఏమి జరిగింది? చిత్రహింసల సమయంలో ఎవరెవరు విధుల్లో ఉన్నారు? ప్రైవేటు వ్యక్తులను అనుమతించారా? ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? వచ్చినట్లయితే డీఐజీగా ఏ చర్యలు తీసుకున్నారు? ఎవరికి సమాచారం ఇచ్చారు? – ఇలాంటి ప్రశ్నలకు సునీల్ నాయక్ మౌనంగా ఉండిపోయారని సమాచారం. ఈ విచారణలు మరిన్ని వివరాలు వెలికితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.