Tummala Urges N. Chandrababu Naidu: తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భద్రాచలం సమీపంలోని ఐదు ఆంధ్రప్రదేశ్ గ్రామాలను తెలంగాణలో విలీనం చేసేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అమరావతిని దేశంలోనే అగ్రగామి రాజధానిగా తీర్చిదిద్దాలనేది తెలుగువారందరి ఆకాంక్ష అని, అదే తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు.

ఉండవల్లిలోని సీఎం నివాసంలో సోమవారం చంద్రబాబుతో తుమ్మల సమావేశమయ్యారు. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన, పలు ముఖ్య అంశాలను లేవనెత్తారు. ‘‘పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశారు. ప్రాజెక్టు నిర్మాణ దృష్ట్యా మేము దాన్ని ఆమోదించాం. ఇప్పుడు భద్రాచలం పట్టణం నుంచి తెలంగాణ వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు గ్రామాల గుండా వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలని చంద్రబాబును కోరాను. ఆయన పరిశీలిస్తానన్నారు’’ అని తుమ్మల వివరించారు.

అదేవిధంగా జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వరకు (వయా వైరా, తల్లాడ్) మరియు ఏలూరు నుంచి కొత్తగూడెం వరకు రెండు జాతీయ రహదారుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా సహకరించాలని కోరారు. ఇవి పూర్తయితే భద్రాచలం పుణ్యక్షేత్రానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత అనుసంధానం పెరుగుతుందని ఆయన తెలిపారు.

అశ్వారావుపేట మండలంలోని ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టు పెదవాగు వరదలకు దెబ్బతిన్న నేపథ్యంలో, ఆయకట్టు ఆధారంగా రెండు రాష్ట్రాలు కలిసి మరమ్మతులు చేపట్టాలని చంద్రబాబు దృష్టికి తెచ్చారని తుమ్మల పేర్కొన్నారు.

చంద్రబాబుతో తన పలకరింపులో ఎలాంటి మార్పు రాలేదని, 1983 నుంచి ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భేటీ సందర్భంగా సీఎంను సత్కరించి జ్ఞాపిక కూడా అందజేశారు.

Tags: