Union Minister Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు గుడ్ న్యూస్: లింక్ డాక్యుమెంట్లు అవసరం లేకుండా 30 ఏళ్లపాటు బ్యాంకు రుణాలు - పెమ్మసాని ప్రకటన

30 ఏళ్లపాటు బ్యాంకు రుణాలు - పెమ్మసాని ప్రకటన

Update: 2025-12-27 11:19 GMT

Union Minister Pemmasani Chandrasekhar: రాజధాని అమరావతి కోసం భూములు సమర్పించిన రైతులకు శుభవార్త తెలిపారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రైతులు ఇచ్చిన భూములకు బదులుగా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాట్లకు సంబంధించి లింక్ డాక్యుమెంట్లు లేకుండానే 30 సంవత్సరాల పాటు బ్యాంకు రుణాలు అందేలా బ్యాంకర్లు అంగీకారం తెలిపారని ఆయన వెల్లడించారు. కేవలం సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) జారీ చేసే డాక్యుమెంట్‌ను ఆధారంగా తీసుకొని రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు సమ్మతించాయని పేర్కొన్నారు.

రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌లు సీఆర్‌డీఏ కార్యాలయంలో దాదాపు మూడు గంటల పాటు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య విషయాలను వివరించారు.

భూ వివాదాలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో స్థానికంగా దాదాపు 10 వేల మంది రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. జరీబు భూముల (బావి నీటి సాగుకు అనువైన భూములు) సమస్యపై సర్వే పూర్తయిందని, కమిటీ నివేదిక ఆధారంగా ఆ రైతులకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.

అలాగే, లంక భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇంకా 277 మంది రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని, వారు త్వరగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అసైన్డ్ భూములకు సంబంధించిన న్యాయ సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశం ద్వారా అమరావతి రైతుల సమస్యల పరిష్కారం వైపు మరో అడుగు పడిందని, ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని పెమ్మసాని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News