CM Chandrababu’s Suggestion: కృత్రిమ మేధస్సుతో పాలనను మరింత సమర్థవంతంగా చేయాలి: సీఎం చంద్రబాబు సూచన

సీఎం చంద్రబాబు సూచన

Update: 2026-03-03 09:37 GMT

CM Chandrababu’s Suggestion: ప్రభుత్వ శాఖల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను విస్తృతంగా అమలు చేసి పాలనా వ్యవస్థలో సమర్థత, వేగం పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం, అధికారుల పనితీరును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం ఉన్నతాధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు.

సోమవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్‌టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ), పబ్లిక్ పాజిటివ్ రెస్పాన్స్ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, డ్రోన్‌లు, సీసీటీవీ కెమెరాలు, శాటిలైట్ ఇమేజరీ వంటి ఆధునిక సాంకేతికతలను సమన్వయం చేసి ఒక సమగ్ర విధానం రూపొందించాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో తమిళనాడులోని శివకాశి ప్రాంతానికి వెళ్లి అక్కడి భద్రతా చర్యలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్‌టీసీ బస్ స్టేషన్లలో ప్రయాణికులకు తాగునీరు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, పింఛన్ల పంపిణీలో ఎలాంటి లోపాలు రాకుండా చూడాలని సూచించారు. అట్టడుగు స్థాయిలో ఉన్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ప్రభుత్వ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని మళ్లీ మళ్లీ సేకరించే సర్వేలు చేయకుండా, అదనపు అవసరమైన సమాచారం కోసం మాత్రమే సర్వేలు నిర్వహించాలని, ప్రజలను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని సీఎం స్పష్టం చేశారు.

అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా వాట్సప్ మనమిత్ర సేవలను మరింత విస్తరించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ప్రస్తుతం ఈ సేవల సంఖ్యను 953కు పెంచినట్లు వివరించారు.

Tags:    

Similar News