Visakhapatnam Partnership Summit 2026: విశాఖ భాగస్వామ్య సదస్సు-2026: ఏపీ బ్రాండ్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా సన్నాహాలు
సన్నాహాలు
Visakhapatnam Partnership Summit 2026: విశాఖపట్నంలో నవంబరు 12, 13 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు (పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్) ప్రధాన థీమ్‌గా ‘వ్యాపారం, సాంకేతికత, విశ్వసనీయత, నాయకత్వ ఆలోచనలు’ (ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్, థాట్ లీడర్‌షిప్)తో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సదస్సు ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తి నింపడంతో పాటు ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్‌ను మరింత పెంచేలా సదస్సును నిర్వహించాలని సూచించారు.
సన్నాహకాల్లో భాగంగా అక్టోబరు 8న ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ దేశాల దౌత్యవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో ఇది జరుగుతుంది. సదస్సుకు ముందు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతి అనే ఐదు చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వీటిలో అక్టోబరు 7న విశాఖ, 12న కాకినాడ, 16న గుంటూరు, 23న అనంతపురం, 26న తిరుపతిలో సదస్సులు జరుగుతాయి. ప్రాంతీయ సదస్సుల్లో ఎంవోయూలు కుదుర్చుకొని, ప్రధాన ప్రాజెక్టుల ఒప్పందాలను విశాఖ సదస్సులోనే ఖరారు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
స్టార్టప్‌లకు పెట్టుబడులు పెట్టే వారి కోసం షార్క్ ట్యాంక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రాంతీయ సమావేశాలకు అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు స్టార్టప్ ఆలోచనలు చేసేలా ప్రాంతీయ సదస్సులు ఉండాలని, ఇన్వెస్ట్ కడప తరహా కార్యక్రమాలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని చెప్పారు. సదస్సుకు ముందే మరో 30 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గతంలో కుదుర్చుకున్న ఎంవోయూలను పెట్టుబడులకు అనువుగా తీర్చిదిద్దడం, ఎస్‌ఐపీబీ ద్వారా ఆమోదించిన ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడంపై దృష్టి పెట్టాలని కూడా సూచించారు.
అధికారులు సీఎంకు వివరించిన సమాచారం ప్రకారం, 2024 జూన్ నుంచి రూ.22.57 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 714 ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదిరాయి. వాటిలో 247 ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యాయి. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు నగరాల్లో రోడ్‌షోలు ఇప్పటికే జరిగాయి. ఈ నెల 25న అహ్మదాబాద్, 28న హైదరాబాద్, 30న ముంబయిలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్‌లలో రోడ్‌షోలు పూర్తయ్యాయి. 29 నుంచి స్వీడన్, జపాన్, చైనాల్లో రోడ్‌షోలకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 11 మంది మంత్రులు, 21 దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యేందుకు అంగీకరించారు.
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం విదేశాలకు బయలుదేరుతున్నారు. ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11 గంటలకు విదేశీ పర్యటనకు బయల్దేరి, ఈ నెల 28న తిరిగి అమరావతి చేరుకుంటారు.