Pawan Kalyan: కాకినాడలో భారీ వర్షాలు: పవన్‌కల్యాణ్ ఆదేశాలు – మరో రెండు రోజులు పూర్తి అప్రమత్తత
పూర్తి అప్రమత్తత
Pawan Kalyan: కాకినాడ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం మరో రెండు రోజులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పూర్తిగా తగ్గే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను వివరంగా తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, అవసరమైతే ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఉపముఖ్యమంత్రికి వివరాలు అందించారు. గత రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 117.6 మి.మీ. వర్షపాతం నమోదైందని, 15 చోట్ల రోడ్లపై చెట్లు కూలడంతో అగ్నిమాపక సిబ్బంది సహకారంతో వాటిని తొలగించినట్లు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో 1,885 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని వివరించారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టం వివరాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని పవన్‌కల్యాణ్ కలెక్టర్‌కు ఆదేశించారు.