CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎవరూ అడ్డుకోలేరని, ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2024 ఎన్నికల ముందు రాష్ట్రం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని, మాట్లాడాలన్నా లేదా నవ్వాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించామని, దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చేరాయని చెప్పారు. ఇది సుపరిపాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
‘‘అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా శాశ్వతంగా కొనసాగుతుంది. మనం దాన్ని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధిని వికేంద్రీకరించి, అన్ని ప్రాంతాలను ప్రగతి మార్గంలో నడిపిస్తాం. ఎన్ని కుట్రలు పన్నినా, అమరావతి పురోగతిని ఎవరూ ఆపలేరు’’ అని సీఎం చంద్రబాబు ధీమాగా తెలిపారు.
సమర్థ నాయకత్వం కీలకం..
గత ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని, తనలాంటి నాయకులను సైతం జైల్లో పెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో 94 శాతం అభ్యర్థులు విజయం సాధించారని, సమర్థ నాయకత్వం ఉంటే ప్రజల జీవితాల్లో భారీ మార్పులు వస్తాయని ఆయన అన్నారు. చెడు చేసినవారిని గుర్తుంచుకుని, మంచి చేస్తున్నవారిని ప్రోత్సహించాలని సూచించారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చానని, ఆ హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను విజయవంతం చేసి చూపించిందని ఆయన పేర్కొన్నారు.
చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేసి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణకు ఇ-ఆటోలు, ట్రైసైకిళ్లు అందజేశామని చెప్పారు. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణాల్లో వదిలేసి వెళ్లిపోయిందని, దీంతో భూగర్భజలాలు, వాయు కాలుష్యం పెరిగాయని ఆయన వివరించారు. ఇప్పుడు ఆ వ్యర్థాలను తొలగించి, శుభ్రమైన వాతావరణాన్ని తిరిగి తీసుకువస్తున్నామని చంద్రబాబు తెలిపారు.