CM Chandrababu Naidu: అర్నబ్ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అదే స్ఫూర్తితో పని చేయాలని అధికారులను ఆదేశించారు.


ముందస్తు చర్యల వల్లే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సీఎం అభినందించారు. రాత్రంతా కష్టపడి పనిచేసిన అధికారులు, ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్లే ప్రాణాలు కాపాడబడ్డాయని పేర్కొన్నారు. 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.


ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 8 వేల హెక్టార్లలో కొబ్బరి, 5 వేల హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా 81 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 180 ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.


కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసి, నష్టం అంచనా వేసేందుకు తక్షణమే కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి చేశారు. రహదారులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పంట నష్టం అంచనా, సహాయక చర్యలు, మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై దృష్టి సారించారు.


తుపాను ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల వెనుక ఉందని, నష్టపోయిన వారందరికీ సాయం అందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Tags: