CM Chandrababu Naidu: రెబల్స్‌ను పార్టీలోకి తీసుకోం.. కూటమి ధర్మమే ముఖ్యం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మాట్లాడుతూ.. రెబల్‌గా పోటీ చేసి గెలిచిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోమని స్పష్టం చేశారు. కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించిన వారికి రీఎంట్రీ ఉండదని గట్టిగా చెప్పారు.
‘‘నాలుగు దశాబ్దాల హింసా ధోరణులు, రప్పారప్పా రాజకీయాల్ని ప్రజలు తిప్పికొట్టారు. రక్త తర్పణాలు, రౌడీయిజం ఓడిపోయి ప్రజాస్వామ్యం గెలిచింది’’ అని సీఎం విశ్లేషించారు. పల్లె, పట్టణమనే తేడా లేకుండా కూటమికి జనం నీరాజనం పట్టారని, ఇది రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి 58.9 శాతం ఓట్లు వచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే కూటమి ఓటు వాటా 9.44 శాతం పెరిగింది. వైకాపాకు 33.56 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. పట్టణాల్లో కూటమికి 59.90 శాతం, గ్రామీణ జడ్పీటీసీల్లో 57.6 శాతం ఓట్లు నమోదయ్యాయి. మేయర్, ఛైర్పర్సన్ పదవుల్లో 94 శాతం స్ట్రైక్‌రేట్ సాధించారు. మొత్తం 9,818 ఎంపీటీసీ స్థానాల్లో 7,803 సాధించి 90 శాతానికి పైగా మండల పరిషత్ అధ్యక్ష పదవులు కైవసం చేసుకున్నారు. 659 జడ్పీటీసీ స్థానాల్లో 575 గెలిచారు.
పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తెనే అదే మున్సిపాలిటీకి ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకోవడం వంటి ఉదాహరణలు ఇచ్చి.. నిరుపేదలు, రాజకీయ నేపథ్యం లేని వారికి అవకాశాలు కల్పించామని సీఎం చెప్పారు. తెదేపా నుంచి గెలిచిన 70 మందిలో 42 మంది మహిళలు, 55 మందికి డిగ్రీ అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉందని వెల్లడించారు. యువతకు భారీ అవకాశాలిచ్చి 30 ఏళ్ల నాయకత్వం తయారు చేశామన్నారు.
రెబల్స్ విషయంలో సీఎం స్పష్టంగా మాట్లాడారు. ‘‘రెబల్స్‌గా పోటీ చేసిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోం. ప్రజలు వారిని అంగీకరించవచ్చు కానీ కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించిన వారికి రీఎంట్రీ ఉండదు’’ అని తేల్చి చెప్పారు. కూటమి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, సీటు త్యాగం చేసి కూటమి గెలుపు కోసం పనిచేసిన వారిని గుర్తించి న్యాయం చేస్తామని మాటిచ్చారు.
వైకాపా ‘గొడ్డలి పార్టీ’ హింసా రాజకీయాలు, తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మలేదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడంతోనే ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు. ఓడిపోయిన చోట్ల సమీక్ష చేసి సమస్యలు పరిష్కరిస్తామని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కూటమి అభ్యర్థులకు అభినందనలు తెలిపిన సీఎం.. మంచి రాజకీయాలు సుపరిపాలనకు, సుపరిపాలన ప్రజావిశ్వాసానికి దారితీస్తుందన్న తన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారని సంతోషం వ్యక్తం చేశారు.