Nara Lokesh : ఆక్వా రంగానికి అన్ని విధాల అండగా నిలుస్తాం
ఆక్వా కల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మంత్రి నారా లోకేష్;
- సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందాం
- అందరం కలిసి సమస్యల పరిష్కారానికి కృషిచేద్దాం
- రష్యా, యూరోపియన్ యూనియన్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి!
- ఆక్వా రైతులకు పవర్ టారిఫ్ లు తగ్గింపుపై చర్చించి నిర్ణయం
రాష్ట్రంలో ఆక్వా రంగానికి అన్ని విధాల అండగా నిలుస్తామని, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్, వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఆక్వా కల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ఆక్వా ఎగుమతి దారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, రైతులు, ఫీడ్ కంపెనీ, హేచరీస్ యజమానులు, అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేలాది మంది ఆక్వారంగంపై ఆధారపడి ఉన్నారు. ఈ రంగం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఆక్వా ఎగుమతులపై అమెరికా 25శాతం సుంకాలను విధించింది. మరో 25 శాతం సుంకాలు పెంచే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆక్వా ఇండస్ట్రీ కలిసి సమస్యల పరిష్కారం కోసం కృషిచేద్దాం. ఇటీవల ఢిల్లీ పర్యటనలోనూ ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర పెద్దలకు వివరించడం జరిగింది. రష్యా, యూరోపియన్ యూనియన్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు పవర్ టారిఫ్ లపైనా చర్చించాల్సిన అవసరం ఉంది. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుందామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు.
దేశీయంగా రొయ్య వినియోగం పెంచేందుకు చర్యలు
వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కేవలం విదేశీ ఎగుమతులపైనే ఆధారపడకుండా దేశీయంగా రొయ్య వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల మార్కెట్ పైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఆర్మీ మెనూలోనూ రొయ్యని చేర్చే విషయంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీడ్ కంపెనీలతో మాట్లాడి ధరలు తగ్గేలా కృషిచేసినందుకు ఆక్వా రైతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ఆక్వా రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సమావేశంలో పాల్గొన్న ఆక్వా ఎగుమతి దారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు కోరారు. పవర్ సబ్సీడీ త్వరగా అమలుచేయాలని రైతులు అభిప్రాయపడ్డారు. ఫీడ్ ధర, ఇతర పన్నులపైనా సమావేశంలో చర్చించారు.
త్వరలోనే కేంద్రానికి నివేదిక
ప్రస్తుతం ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే కేంద్రానికి నివేదిస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, ఏహెచ్, డీడీ అండ్ ఫిషరీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులతో పాటు ఆక్వా ఎగుమతి దారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, రైతులు, ఫీడ్ కంపెనీ, హేచరీస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.