CM Chandrababu: ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
వ్యాలీగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చి, పర్యావరణ హితమైన ఇంధన ఉత్పత్తిలో ముందంజ వేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. కాకినాడలో రూ.18 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, గ్రీన్ అమ్మోనియా భవిష్యత్ ఇంధన విప్లవానికి నాంది పలుకుతుందని చంద్రబాబు అన్నారు.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలని పిలుపునిస్తున్నారు. 2014లో మా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి ఆరంభం చేసింది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా దిశగా అడుగులు వేస్తున్నాం. కాకినాడలో వచ్చే ఈ పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా యూనిట్. 2027 జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి మొదలవుతుంది. ఇది మన రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుంది. బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది, కాలుష్యం సముద్రాలను కూడా ప్రభావితం చేస్తోంది. మనకు 1000 కి.మీ సముద్ర తీరం, 20 పోర్టులు ఉన్నాయి. సూర్యకాంతి పుష్కలంగా లభ్యమవుతున్న మన దేశంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్‌లు మనకు వరాలు. మన సంస్కృతిని కాపాడుకుంటూ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ఎంత ఎదిగినా స్వగ్రామాన్ని మరచిపోకూడదు. ఆలోచనలను ఆచరణలో పెట్టేవారు అరుదు, అలాంటి వారిలో చలమలశెట్టి అనిల్ ఒకరు. తెలుగువారు చరిత్ర సృష్టించడం గర్వకారణం. ఎన్టీఆర్ చొరవతో కాకినాడకు నాగార్జున ఫెర్టిలైజర్స్ వచ్చింది. భవిష్యత్తులో కాకినాడ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఇలాంటి పరిశ్రమలకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. ప్రజల మేలు కోసం కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోంది. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతాం. గ్రీన్ అమ్మోనియా వ్యవసాయానికి బూస్ట్ ఇస్తుంది. ప్రకృతి సేద్యం పెంచడం అందరి ఆరోగ్యానికి మేలు. ఎరువులు, పురుగుమందులు తగ్గించాలి. ఈ ఉత్పత్తిని ప్రపంచానికి ఎగుమతి చేయవచ్చు’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
అదే సభలో మాట్లాడుతూ, బలమైన సంకల్పంతోనే ఏదైనా సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో పుట్టి పెరిగిన అనిల్ తన స్వస్థలానికి ఎంతో చేస్తున్నారని ప్రశంసించారు. ‘‘కష్టాలను అధిగమించి ఏఎం గ్రీన్ కంపెనీ స్థాపించారు. పర్యావరణ పరిరక్షణతో ముందుకు సాగుతున్నాం. గ్రీన్ హైడ్రోజన్ వైపు అడుగులు కీలకం. క్లీన్ ఎనర్జీ పాలసీతో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. కాలుష్య రహిత ఇంధనంలో ఇది మైలురాయి. రాష్ట్ర అభివృద్ధికి గేమ్ ఛేంజర్. ఈ ప్రాజెక్టు వల్ల వేల మందికి ఉపాధి లభిస్తుంది. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు తెలుసు. పార్టీలు మారినా, ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతం’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.