N. Chandrababu Naidu: అవకాశాలను ఉపయోగిస్తేనే సంపద సృష్టి సాధ్యం: సీఎం చంద్రబాబు
సంపద సృష్టి సాధ్యం: సీఎం చంద్రబాబు
N. Chandrababu Naidu: రాష్ట్రంలో సంపద సృష్టి కోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నీటి వనరులను సక్రమంగా వినియోగించుకుంటేనే నిజమైన ప్రయోజనం ఉంటుందని, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరుగుతున్న రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, పెట్టుబడులు, వైద్యం, సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు, ఆదాయార్జన శాఖలు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతోందని తెలిపారు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై అధికారులకు వివరణలు ఇచ్చారు.
‘‘రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సంపద సృష్టించే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో జిల్లాల వారీగా వివరాలు సిద్ధం చేయాలి. గత వైకాపా పాలనలో పెట్టుబడులు రావడం లేదు, ఉన్న కంపెనీలు కూడా పారిపోయాయి. వనరులను సరైన రీతిలో ఉపయోగించకపోతే వ్యర్థమవుతాయి’’ అని చంద్రబాబు అన్నారు.
అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఏఐ, ఫిలిమ్, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఏమీ లేని ప్రాంతాల్లో కూడా టూరిజం అభివృద్ధి చేస్తున్న దేశాల ఉదాహరణలు ఇస్తూ, రాష్ట్రంలోని చరిత్రాత్మక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. ‘‘సూర్యలంకను మరో గోవాగా తీర్చిదిద్దుతాం. తిమ్మమ్మ మర్రిమాను వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. కంభం చెరువు ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత నీటి వనరు’’ అని ఆయన పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో జిల్లా కలెక్టర్లు పోటీపడాలని సీఎం సూచించారు. జిల్లాల వారీగా ర్యాంకులు ఇస్తామని, పెట్టుబడులు ఆకర్షించడంలో కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆదేశించారు. జిల్లాల్లోని అవకాశాలు, అనుకూలతల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. భూ కేటాయింపులు యుద్ధప్రాతిపదికన జరిగేలా చూడాలని ఆదేశించారు.
మధ్యాహ్నం నుంచి శాంతిభద్రతల అంశంపై సమీక్ష జరుగుతుందని, డీజీపీ, జిల్లా ఎస్పీలు హాజరవుతారని తెలిపారు.