Malladi Vishnu : అధికార పార్టీ నేతల భూకబ్జాపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు

కూటమి పార్టీ నేతల భూకబ్జాలపై మాజీ ఎమ్మెల్యే మల్లాది ఫైర్;

Update: 2025-08-08 09:56 GMT
  • తారాస్థాయికి చేరిన అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ఆక్రమణలు..
  • విలువైన విద్యాసంస్థల భూముల ఆక్రమణకు బరితెగింపు..
  • శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు బెదిరింపులు..
  • మాట వినకపోతే కుటుంబాన్ని అంతం చేస్తానని హెచ్చరిక..
  • ఇంత జరుగుతున్నా నోరు మెదపని ముఖ్యమంత్రి చంద్రబాబు..
  • కాలేజీ భూమిని ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలి..
  • శాతవాహన విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి..

విజయవాడలో శాతవాహన కళాశాల భూములను ఆక్రమించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ బెదిరింపులు తారాస్థాయికి చేరాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు మండిపడ్డారు. తన మాట వినకపోతే ఏకంగా కుటుంబాన్నే చంపేస్తానంటూ కాలేజ్ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ ను ఆలపాటి బెదిరించడాన్ని విష్ణు తీవ్రంగా ఆక్షేపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు తమ కబ్జాల కోసం విద్యాసంస్థల్లో సైతం చొరబడ్డంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును ఆలపాటి రాజేంద్ర బెదిరించిన విషయంపై బాధితుడు పోలీసులను కూడా ఆశ్రయించారు. అధికార పార్టీకు చెందిన ఎమ్మెల్సీ, నేతలు కబ్జా పర్వంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీకి, తెనాలిలో ఉంటున్న ఆలపాటి రాజాకి సంబంధం ఏమిటి అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. విజయవాడలో విద్యార్ధుల భవిష్యత్తు పేరుతో మీరు ఎందుకు ఈ కళాశాల వ్యవహారాలలో చొరబడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికే మరో వర్గం ఈ కాలేజీ భూములు మా ప్రాపర్టీ అని చెబుతోందని ఇంత వివాదం జరుగుతున్నా అధికారపార్టీ మౌనం ఏ రకమైన సంకేతాలిస్తోందని విష్ణు మండిపడ్డారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో 5 ఎకరాల కాలేజీ స్థలాన్ని కబ్జా చేయడానికి వర్గాలుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తుంటే అధికార యంత్రాంగం సైతం పట్టనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఈ వివాదంపై గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించారని అధికార పార్టీ నేతలే ఈ రకమైన దౌర్జన్యాలకు పాల్పడుతుంటే సామాన్య ప్రజలు ఎవరిని ఆశ్రయించాలని మల్లాది విష్ణు ప్రశ్నించారు.

కాలేజీ భూములను ప్రభుత్వ స్వాధీనం చేయాలి

శాతవాహన కాలేజీ భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకుని కబ్జా దారుల నుంచి కాపాడాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి విభాగం పలుమార్లు ఆందోళన కూడా చేపట్టందని విష్ణు గుర్తు చేవారు. ఈ భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవాలని కూడా డిమాండ్ చేశామని వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు శాతవాహన కాలేజీ భూముల రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి పార్టీ వ్యక్తులే హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? జిల్లా కలెక్టర్ ఎందుకు ఈ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం లేదు? పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఇలా కాలేజీ భూములను ఆక్రమించే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిలదీశారు. మీ పార్టీ నేతలు చేస్తున్న అనైతిక కార్యకలాపాలను విజయవాడ ప్రజలు గమనిస్తున్నారు, సరైన టైంలో మీకు బుద్ధి చెప్పడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు హెచ్చరించారు.

Tags:    

Similar News