Free Bus : అన్ని రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలి
వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్;
- షరతులు లేకుండా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలి
- 5 రకాల బస్సులకే పరిమితం చేయడం తగదు..
- మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో షరతులు ఉంటాయని ఎందుకు చెప్పలేదు..?
- కాకినాడ లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన
మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ఎలాగైతే హామీ ఇచ్చిందో ఆ విధంగానే షరతులు లేకుండా రాష్ట్రంలో తిరిగే అన్ని రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. కాకినాడ లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని, నేను సేఫ్ డ్రైవర్‌గా ఉంటానని చెప్పిన చంద్రబాబు.. ఏడాది తర్వాత పథకాన్ని అమలు చేస్తూ దాన్ని 5 రకాల సర్వీసులకు మాత్రమే ఎలా పరిమితం చేస్తారని ప్రశ్నించారు. దీంతోపాటు రూ. 5 లక్షలు చెల్లించి మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్ లకు అనుమతించడాన్ని వైయస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఒకపక్క లిక్కర్ వల్ల రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న నేరాలు పెరిగిపోతున్నాయని తెలిసి కూడా మహిళా మంత్రులు అలాంటి నిర్ణయానికి ఎలా ఆమోదం తెలిపారని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు ఆరితేరిపోయారని కళ్యాణి విమర్శించారు. చీటింగ్‌కి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిపోతాడన్నారు.. ఏడాది పాలనకే సుపరిపాలన కాదని శుద్దదండగ పాలన అని, ఇది కూటమి ప్రభుత్వం కాదు.. కోతల ప్రభుత్వమని, మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని ప్రజలే తేల్చేశారన్నారు.
మేనిఫెస్టోలో ఆ షరతులు ఎందుకు పెట్టలేదు..?
ఐదు రకాల సర్వీసుల్లో మొత్తం 6,700 బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పి చంద్రబాబు మరోసారి వంచనకు తెరదీశారని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్‌జిల్లాల పరిధిలో తిరిగే 90 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం లేనప్పుడు పథకం అమలు చేయడం దేనికని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఆర్టీసీ బస్సుల్లో అంతా ఉచిత ప్రయాణమే అంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ ప్రెస్ వంటి ఐదు రకాల బస్సులకు మాత్రమే వర్తింపచేస్తారని ఇప్పుడు చెప్పడం మహిళలను వంచించడమే అన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా అవి సగటున 40-50 కిలోమీటర్లకు దాటదు. సిటీ ఆర్డినరీ బస్సులు కూడా 30 కిలోమీటర్లు దాటి వెళ్లవు. ఎక్స్ ప్రెస్ సర్వీసులు కూడా గరిష్టంగా ఒక రూటులో 150 కిలోమీటర్లకు మించి వెళ్లవు. పైగా వీటి సంఖ్య చాలా తక్కువ. అంటే ఈ లెక్కన జిల్లాల సరిహద్దులు దాటి వెళ్లే బస్సులు చాలా తక్కువ. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో 5 రకాల బస్సుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తింపజేస్తామని ఎందుకు చెప్పలేదు అని వరుదు కళ్యాణి నిలదీశారు. మీరు ఎన్నికలకు ముందు టీవీ యాడ్స్ లో ప్రచారం చేసుకున్నట్టుగా తిరుపతి, అన్నవరం, విజయవాడ, సింహాచలం, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి దేవాలయాలకు మహిళలని మొక్కులు తీర్చుకునేందుకు ఈ బస్సుల్లో ఉచితంగా వెళ్లనిస్తారా లేదా? ఉచిత బస్సుకి నెలకు అయ్యే ఖర్చు రూ. 300 కోట్లకు మించదు. అంటే ఏడాదికి దాదాపు రూ.3వేల కోట్లు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. ముగ్గురూ స్పెషల్ ఫ్లైట్స్, చాపర్‌లలో తిరగడానికి అయ్యే ఖర్చు కన్నా ఇది తక్కువే అవుతుందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు అన్నారు. రాష్ట్రంలో తిరుగుతున్న అన్ని బస్సుల్లో మహిళలకు షరతులు లేకుండా ఉచిత ప్రయాణం హామీని అమలు చేయాలని వైయస్సార్సీపీ తరఫున వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.