Y. S. Sharmila: వైకాపా సిద్ధాంతం నరకం.. చంపుడు.. నాశనమే! ‘మావిగన్‌ కాదు.. అవి గొడ్డలి' పెట్టండి : షర్మిల తీవ్ర విమర్శ

‘మావిగన్‌ కాదు.. అవి గొడ్డలి' పెట్టండి : షర్మిల తీవ్ర విమర్శ

Update: 2026-04-10 15:08 GMT

Y. S. Sharmila: ఏపీ రాజధాని అమరావతికి జగన్ పేరుతో ‘మావిగన్‌’ అని పెట్టాలని వైకాపా నిర్ణయించిందని, అదే విధంగా పులివెందులకు అవినాశ్ పేరుతో ‘అవిగొడ్డలి’ అని పేరు పెట్టాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా ఎద్దేవా చేశారు. జగన్ పేరులో ‘గన్‌’ ఉందని, అవినాశ్ పేరులో ‘వినాశనం’ ఉందని, ‘ఎంతసేపూ నరకాలి.. చంపాలి.. నాశనం చేయాలి’ అనేదే వైకాపా సిద్ధాంతమని మండిపడ్డారు.

నిండు సభలో విజయమ్మను అవమానించినందుకు బొత్స సాత్యనారాయణ ఎంత ఏడ్చినా తక్కువేనని షర్మిల వ్యాఖ్యానించారు. ‘‘మావిగన్‌.. ఎప్పుడూ గన్‌లు, గొడ్డల్లేనా? ఐదేళ్లలో రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు. ఇప్పుడు అమరావతి వద్దట.. మావిగన్‌ పెడతారట. పులివెందుల పేరు బదులు ‘అవిగొడ్డలి’ అని పెట్టండి’’ అని ఎద్దేవా చేశారు.

మావిగన్ అద్భుత ఆలోచన అయితే ఐదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మావిగన్‌కు తక్కువ ఖర్చు అయితే మూడు రాజధానులు ఎందుకన్నారని, జగన్ ఐదేళ్లు నిద్రపోయారా అని మండిపడ్డారు. జగన్ మీద మా వైఖరి అడుగుతున్నారని, ఎవరైనా జోక్ వింటే బిగ్గరగా నవ్వుతారు.. మా నవ్వు ‘మావిగన్‌’ మీదున్న అర్థమని వ్యాఖ్యానించారు.

అమరావతి అంశంపై కాంగ్రెస్ వైఖరి ఇప్పటికే స్పష్టంగా చెప్పామని షర్మిల గుర్తు చేశారు. పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చామని, అమరావతి కట్టడం కేంద్రం బాధ్యత అని తెలిపామని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశామని చెప్పారు. అమరావతికి పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు.

నన్ను కూటమికి దత్తపుత్రిక అంటున్నారని, పచ్చకామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని ఎద్దేవా చేశారు. జగన్ మాత్రం భాజపాకి దత్తపుత్రుడని, మోదీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారని తీవ్రంగా విమర్శించారు. వీళ్లు అలా చేశారు కాబట్టి అందరూ అలాగే ఉంటారనుకోవడం పొరపాటని అన్నారు.

‘‘మేం వైఎస్సార్ ఐడియాలజీకి నిజమైన వారసులం. వైఎస్సార్ పేరు వాడుకునే హక్కు ఎవరికీ లేదు. ప్రజల పక్షాన పోరాటం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే’’ అని షర్మిల స్పష్టం చేశారు.

Tags:    

Similar News