CM Chandrababu Naidu: రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేక వైసీపీ నేతలు రోడ్లు కూడా తవ్వుతున్నారని, ఉన్మాదుల్లా తయారయ్యారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఉండవల్లిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రోజు కూడా వృథా చేయకుండా పనిచేశామని సీఎం చెప్పారు. రూ.1.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు. వైసీపీ చేసిన చెత్తంతా క్లీన్ చేశామని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టును 2027 మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని సీఎం తెలిపారు. అమరావతిలో ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మాణం జరుగుతోందని, క్వాంటమ్ వ్యాలీ వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని చెప్పారు. మెగా డీఎస్సీని ఆపేందుకు వైసీపీ నేతలు ఎన్నోసార్లు కోర్టులకు వెళ్లారని విమర్శించారు.

వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక రోడ్లను ట్రాక్టర్లతో దున్నించారని, అమరావతిని ఎగతాళి చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. “మేము ప్రజలకు సేవకులం.. పెత్తందార్లం కాదు” అని స్పష్టం చేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తోందని, ఈ గెలుపు ప్రజలదేనని అన్నారు.

ప్రెస్‌మీట్‌లో సీఎం వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలు, రాజధాని వ్యవహారంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని, ప్రజలు ఇచ్చిన మద్దతుతోనే ఈ పనులు సాధ్యమయ్యాయని చెప్పారు.

Tags: