YSR Congress Party : వైయస్ జగన్ నెల్లూరు పర్యటన గ్రాండ్ సక్సెస్
కూటమి కుట్రలను ప్రజలు తిప్పికొట్టారన్న నెల్లూరు వైసీపీ నేతలు;
- హెలిప్యాడ్ పర్మిషన్ దగ్గర్నుంచి అడుగడుగునా ఆటంకాలు
- బారికేడ్లతో రోడ్లు మూసివేత, కేసులతో బెదిరింపులు
- అభిమానులను అడ్డుకోవడానికి జేసీబీలతో రోడ్లను తవ్వేశారు
- నిర్బంధాలను అధిగమించి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
- స్పష్టం చేసిన వైయస్సార్సీపీ నాయకులు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాటిని తిప్పికొట్టారని, ఆయన పర్యటనను విజయవతం చేశారని నెల్లూరు వైయస్ఆర్‌సీపీ నేతలు అన్నారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నేతలు ఆనం విజయ్‌కుమార్ రెడ్డి, మేరగ మురళి, కాకాణి పూజిత తదితరులు జగన్మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనపై మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మాజీ సీఎం పర్యటనకు జనం రాకూడదని రోడ్లను కూడా తవ్వేయడం, జేసీబీ లను అడ్డం పెట్టడం వంటి చేష్టలు మన రాష్ట్రంలోనే చూశామని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భంధాలను అధిగమించి వేలాదిగా జనం వైయస్ జగన్ వెంట నడిచారని, ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు ఇది నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడూ లేనిది నెల్లూరు జిల్లా రాజకీయాలను భ్రష్టుపట్టించారన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా సీనియర్ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారని చెప్పారు.ఈ రెండు ఘటనల నేపథ్యంలో వారికి అండగా ఉన్నానని చెప్పడానికి జిల్లాకు మాజీ సీఎం వైయస్ జగన్ వస్తుంటే ఆయన్ను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదన్నారు. 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉందని ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని, హోంమంత్రి, డీజీపీ, ఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న మా కుటుంబానికి వైయస్ జగన్ నెల్లూరు వచ్చి భరోసా ఇవ్వడం మాకెంతో బలాన్నిచ్చిందని కాకాని పూజిత అన్నారు.