YSR JAYANTHI :నేడు వైఎస్‌ఆర్ 76వ జయంతి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నివాళులు అర్పించిన అభిమానులు;
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 175 నియోజకవర్గాల్లో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇడుపుల పాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ ని సందర్శించి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. వైఎస్‌ఆర్ సతీమణి వైఎస్.విజయమ్మ కూడా భర్త సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. ఇడుపుల పాయలో జరిగిన వైఎస్‌ఆర్ 76వ జయంతి కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, వైఎస్‌ఆర్సీపీ కార్యకర్తలు పెద్దయెత్తున పాల్గొన్నారు.