YSRCP Leaders Join Jana Sena: జనసేనలోకి వైసీపీ నేతల చేరిక.. పవన్ సమక్షంలో కండువా కప్పుకున్న నాయకులు
నాయకులు
YSRCP Leaders Join Jana Sena: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వైకాపా నేత యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైకాపా నాయకుడు నవీన్ నిశ్చల్‌తో పాటు అనేకమంది వైకాపా నాయకులు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. వివిధ జిల్లాల్లో వైకాపాలో కీలక బాధ్యతలు నిర్వహించిన వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
జనసేన సిద్ధాంతాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిపాలనా నిబద్ధత, సంస్కరణలు నచ్చి తాము ఈ పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో వీరు పార్టీ కండువా ధరించారు.
ఈ సందర్భంగా ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ పీవీఎల్‌ఎన్ నరసింహరాజు, వైకాపా కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాల పరిశీలకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు అయితాబత్తుల సుభాషిణి, తుని వైకాపా నాయకుడు పొలినాటి శేషగిరిరావు, తణుకు వైకాపా నాయకుడు దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన సత్రవాడ ప్రవీణ్, మిద్దెల హరి, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కుడిపూడి శివన్నారాయణ, నరసరావుపేటకు చెందిన ఏలూరి ప్రసాద్ తదితరులు కూడా జనసేనలో చేరారు.
ఇదే రోజు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కేంద్ర సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. కమిటీ విధివిధానాలు, బాధ్యతలు, పనితీరు, కేంద్ర కార్యాలయం నుంచి అందించే సహకారం గురించి వారికి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేసి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.