Pulivendula Ontimitta : పులివెందుల, ఒంటమిట్టలో వైఎస్‌ఆర్‌సీపీ కంఠశోష

యథేచ్ఛగా దొంగ ఓటర్లను ప్రోత్సహించిన టీడీపీ నేతలు..;

Update: 2025-08-12 11:23 GMT
  • అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్టు వేయండి..
  • రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైయస్సార్సీపీ నేతలు విజ్ఞప్తి.
  • పులివెందులలో ఓటర్లను సైతం అంగీకరించక పోవడం దుర్మార్గం..
  • చంద్రబాబు చర్యలతో ప్రజాస్వామ్యం వందేళ్ల వెనక్కి..
  • దీని ప్రతిఫలం అనుభవించక తప్పదు..
  • ఎన్నికల్లో కూటమి పార్టీ ఆకృత్యాలపై వైయస్సార్సీపీ నేతలు ఫైర్..

పులివెందుల, ఒంటిమిట్ట జడ్‌పీటీసీ స్థానాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కనీవినీ ఎరుగని స్ధాయిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్ధాయిలో మండిపడుతోంది. మంగళవారం ఉదయం పోలింగ్‌ బూత్‌లు ప్రారంభమైన వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని టీడీపీ గూండాలు తమ ఆధీనంలోకి తీసుకుని ఓట్లు వేయడానికి కూడా ఎవరినీ రానివ్వలేదని వైసీపీ ఆరోపిస్తోంది. పులివెందులలో ఓటర్లను కూడా బూత్‌ల్లోకి వెళ్ళడానికి అంగీకరించలేదు. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన నాయకులందరిని అరెస్టులు చేసి పోలింగ్‌ బూత్‌లవైపు వెళ్లకుండా పోలీసులు అధికార పార్టీ నాయకుల కన్నా ఘోరంగా ప్రవర్తించారని, ఈ రెండు జడ్పీటీసీ స్ధానాల్లో టీడీపీ నాయకులు, పోలీసులు కలసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల్లోకి టీడీపీకి చెందిన ఇతర ప్రాంత నాయకులు కూడా యధేచ్ఛగా వెళ్లి తమ ఇష్టానుసారం ఓట్లు వేయించారని, మంత్రులను సైతం అక్రమంగా బూత్‌లలోకి చొరబడి వైఎస్‌ఆర్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను బెదిరించి ఓటర్ల చేతుల్లోంచి ఓటింగ్‌ స్లీప్‌లు లాక్కున్నా పోలీసులు పట్టించుకోలేదని వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. పోలింగ్‌ బూత్‌ల లోపల ఇతర ప్రాంతాల వాళ్ళు ఉన్నరని ఆధారాలతో సహా పోలీసులుకు బూత్‌ల బయట ఉండి చూపిస్తున్నా పోలీసులు మమ్మల్నే అక్కడ నుంచి పంపించేశారని వైఎస్‌ఆర్‌పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పులివెందుల, అటు ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నాయకులు చేసిన అక్రమాలను ఆధారభరితంగా చూపించినా మాది కంఠశోషగా మిగిలిపోయింది తప్పితే పోలీసులు స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కలిసిన వైయస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, హఫీజ్ ఖాన్, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ, అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలపై ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వారం రోజుల నుంచి ఈ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను, ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకు వెళ్ళినా కమిషన్‌ పెడచెవిన పెట్టందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ ప్రతినిధిబృందం సోమవారం విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి వినతిపత్రం సమర్పించారు. పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి ఓటర్లను బూత్‌ లలోకి వెళ్లనివ్వకుండా, దొంగ ఓట్లతో దొడ్డిదోవన గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. పోలీసులు సైతం అధికారపార్టీకి చెందిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ, మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News