Satyakumar Yadav: జోనల్‌ స్థాయి నియామకాల్లో పారదర్శకతను మరింత పెంచేందుకు వైద్యారోగ్య శాఖ అధీనంలోని జోనల్‌ స్థాయి పోస్టుల భర్తీని కూడా ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవల నియామక బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) ద్వారానే చేపట్టనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రకటించారు.

జీరో వేకెన్సీ పాలసీ అమలు చేస్తూ పోస్టుల భర్తీకి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం స్టాఫ్‌ నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఫార్మసీ అసిస్టెంట్లు, మలేరియా నివారణ అధికారులు, గణాంకాధికారులు తదితర పోస్టుల భర్తీ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, కడప జోనల్‌ కార్యాలయాల వారీగా జరుగుతోంది.

ఈ ప్రక్రియలో కొన్నిసార్లు జాప్యం ఏర్పడి విమర్శలు వస్తున్న నేపథ్యంలో, జోనల్‌ స్థాయిలో సిబ్బంది పనిభారం తగ్గించి, నియామకాలను మరింత సమర్థవంతంగా చేపట్టాలనే ఉద్దేశంతో ఏపీఎంఎస్‌ఆర్‌బీ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.

ఏపీఎంఎస్‌ఆర్‌బీ ద్వారా 2024 మార్చి నుంచి 2026 మార్చి వరకు 2,310 నియామకాలు జరిగాయని మంత్రి తెలిపారు. త్వరలో బోధనా సుపత్రుల్లో 317 అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.

ఈ నిర్ణయంతో నియామకాల ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతుందని, వైద్య ఆరోగ్య రంగంలో సిబ్బంది కొరత త్వరగా తీరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: