Oben : ఓలాకు పోటీగా ఓబెన్ కొత్త ఎలక్ట్రిక్ బైక్.. సూపర్ ఫీచర్లతో ఆగస్టు 5న లాంచ్
సూపర్ ఫీచర్లతో ఆగస్టు 5న లాంచ్;
Oben : భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓబెన్ కంపెనీ తమ కొత్త తరం ఓబెన్ EZ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఆగస్టు 5, 2025న విడుదల చేయనుంది. EZని నవంబర్ 2024లో తొలిసారిగా లాంచ్ చేశారు. డెలివరీలు మాత్రం ఆగస్టు 15, 2025 నుంచి ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. కొత్త ఓబెన్ EZలో, కంపెనీ సొంతంగా తయారుచేసిన హై-పెర్ఫార్మెన్స్ LFP బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఓబెన్ తెలిపింది. ఈ బ్యాటరీ ప్రత్యేకత ఏంటంటే, ఇది మామూలు బ్యాటరీల కంటే 50% ఎక్కువ వేడిని తట్టుకోగలదు. అంతేకాదు దీని లైఫ్ కూడా రెట్టింపు ఉంటుంది. దీనివల్ల బైక్ నమ్మకమైన పర్ఫామెన్స్ కనబరుస్తుందని కంపెనీ చెబుతోంది. ఓబెన్ ఈ కొత్త మోటార్‌సైకిల్ గురించి ఇంకా పూర్తి వివరాలు చెప్పలేదు. అయితే, ఇది రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని, అలాగే మెరుగైన అనుభవం కోరుకునే వారికి కొన్ని అప్‌గ్రేడ్‌లు ఉంటాయని కంపెనీ పేర్కొంది.
ఈ ఏడాది మొదట్లో, ఓబెన్ తమ కొత్త O100 ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. రూ.లక్ష కంటే తక్కువ ధర ఉండే మోడళ్లకు ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటుంది. బెంగళూరులోని ఓబెన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కేంద్రంలోనే ఈ O100 ప్లాట్‌ఫామ్‌ను తయారు చేశారు. ఇది వివిధ రకాల వేరియంట్లకు, బ్యాటరీ ఆప్షన్లకు సపోర్ట్ చేస్తుందని, వేర్వేరు కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఓబెన్ రార్ EZ బైక్ రెండు వేరియంట్లలో వస్తుంది. 3.4 kWh వెర్షన్ ధర రూ.1,19,999.4.4 kWh వెర్షన్ ధర రూ.1,29,999. ఇంకో 2.6 kWh వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్ గరిష్టంగా 95 కి.మీ. వేగంతో వెళ్తుంది. కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగం అందుకోగలదు. ఇది IDC-సర్టిఫైడ్ 175 కి.మీ. వరకు రేంజ్‌ను ఇస్తుంది.